Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

- నటీనటులు, టెక్నీషియన్స్‌ను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు
- డబ్బులు వసూలు చేస్తున్న మోసగాళ్లు
- ఫేక్ ఆఫర్స్‌ను నమ్మొద్దని అన్నపూర్ణ స్టూడియోస్ హెచ్చరిక
- అనుమానాలుంటే తమను సంప్రదించాలని సూచన
తమ పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం పేర్కొంది. నటీనటులు, సాంకేతిక నిపుణులుగా అవకాశాలు కల్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించామని వెల్లడించింది. తమ సంస్థ ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బులు వసూలు చేయదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, నిరుద్యోగులు, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిని మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో తెలిసిన వారున్నారని, సినిమా, సీరియల్ షూటింగ్‌లకు తీసుకెళ్లి నటింపజేస్తామని కొందరు నమ్మబలుకుతున్నారు. ఈ మేరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని అన్నపూర్ణ స్టూడియోస్ హెచ్చరించింది. తమ సంస్థలో ఉద్యోగాలు, అవకాశాల పేరుతో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మొద్దని సూచించింది. ఆడిషన్స్ లేదా ఇతరత్రా ప్రక్రియల కోసం తాము డబ్బులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఎవరికైనా అనుమానాస్పద ఆఫర్లు వస్తే తమ అధికారిక మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది.