Amit Shah: అలాంటి వారి పట్ల మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది: అమిత్ షా

- దురాలోచనతో దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడుగుపెట్టనివ్వబోమన్న అమిత్ షా
- విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపార పరంగా వస్తే ఆహ్వానిస్తామని స్పష్టీకరణ
- అక్రమ చొరబాటుదారులకు బెంగాల్ ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపణ
దురాలోచనతో దేశంలోకి ప్రవేశించి, హాని కలిగించాలనుకునే వారి పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారిని అడుగు పెట్టనివ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అందరికీ ఆహ్వానం పలకడానికి భారతదేశం ధర్మశాల కాదని వ్యాఖ్యానించారు.
'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025'కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, విద్యా, వైద్యం, పర్యాటకం, వ్యాపార పరంగా మన దేశంలోకి విదేశీయులను ఆహ్వానిస్తామని, కానీ దురుద్దేశంతో ప్రవేశించే వారి పట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి సహకరించే వారికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని ఆయన అన్నారు.
ఈ బిల్లు భారత్ సందర్శించే ప్రతి విదేశీయుడి గురించిన మొత్తం సమాచారాన్ని స్వీకరిస్తుందని ఆయన వెల్లడించారు. మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చే రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలతో అలాంటి వారిని దేశంలోకి రానిస్తే అది ఎంతమాత్రమూ సురక్షితం కాదని అన్నారు.
బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులకు సహకరిస్తోందని ఆరోపించారు. వారికి ఆధార్ కార్డులు ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తోందని మండిపడ్డారు. చొరబాట్ల నివారణకు కంచె ఏర్పాటు చేయడానికి బెంగాల్ ప్రభుత్వం కనీసం భూమిని కేటాయించలేకపోయిందని విమర్శించారు. అందుకే 450 కిలోమీటర్ల మేర కంచె పూర్తి కాలేదని అన్నారు.
ఈ ఇమ్మిగ్రేషన్ బిల్లు దేశ భద్రతకు, అలాగే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.