Sunrisers Hyderabad: అంచనాలు అందుకోలేక... ఉప్పల్ లో నిరాశపరిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్

- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు
250 స్కోరంటే అవలీలగా కొట్టేసే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ అంచనాలను అందుకోలేకపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో కనీసం 200 కూడా స్కోరు చేయలేక 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులతో సరిపెట్టుకుంది. అది కూడా సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఈ విధంగా ఆడడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ చూస్తే... ఓపెనర్ అభిషేక్ శర్మ (6) ఆరంభంలోనే అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికే ఇషాన్ కిషన్ (0) డకౌట్ అయ్యాడు. తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించి ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఇషాన్ కిషన్ ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు శార్దూల్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లాయి. మరో ఎండ్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడి 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి 32, హెన్రిచ్ క్లాసెన్ 26 పరుగులు చేసినా, భారీ స్కోర్లు సాధించలేకపోయారు.
ఈ దశలో అనికేత్ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే చకచకా 36 పరుగులు చేశాడు. అనికేత్ ఏకంగా 5 సిక్సర్లు బాదడం విశేషం. అటు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కేవలం 4 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. కమిన్స్ 3 సిక్సులు బాది అవేష్ ఖాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో రాణించగా... అవేష్ ఖాన్ 1, దిగ్వేష్ రాఠీ 1, రవి బిష్ణోయ్ 1, ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ తీశారు.