కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ రాష్ట్ర సేన' ఆవిర్భావం.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
- తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కవిత
- బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్న ఆరోపణ
- కేసీఆర్ మారిపోయారని, ఆయన మన మనిషి కాదంటూ తీవ్ర విమర్శలు
- సామాజిక తెలంగాణే లక్ష్యమని, రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా
- తప్పకుండా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేసిన కవిత
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూ, ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
"ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ఒకప్పటి కేసీఆర్ కాదు. ఆయన 'మర మనిషి'గా మారిపోయారు, మన మనిషి కాదు. ఆయన గుంట నక్కల చేతిలో ఖైదీగా మారారు" అంటూ కవిత తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదని, అధికారం ముందు మమకారం తగ్గిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను హెచ్చరించినా, తనను పక్కనపెట్టి 'పందికొక్కులను' అందలం ఎక్కించారని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పని చేశారని, ఇప్పుడు తన రాష్ట్రం కోసం స్వేచ్ఛగా పోరాడతానని అన్నారు.
సామాజిక తెలంగాణ సాధనే తమ పార్టీ లక్ష్యమని కవిత ప్రకటించారు. రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మందికి 'అమ్మ'గా మారి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేశారు. పార్టీ ప్రకటనకు ముందు కవిత తన బంజారాహిల్స్ నివాసంలో సర్వమత ప్రార్థనలు చేసి, గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.