ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు
- వాటిలో 600 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు
- జులై నాటికే అందుబాటులోకి తీసుకురానున్న ప్రభుత్వం
- ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.50 లక్షల ఖర్చు
ఏప్రిల్‌లో టెండర్లు.. ఆగస్టుకల్లా పూర్తి!
ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించి జులై లేదా ఆగస్టు నాటికే ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నెడ్‌క్యాప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 80% కేంద్రం భరిస్తుండగా, మిగిలిన 20% వాటాను డిస్కంలు సమకూరుస్తాయి. ఐదేళ్ల పాటు ఆపరేటర్లు వీటిని నిర్వహిస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ప్రధానంగా డిస్కంలకే చెందుతుంది.
రెండో దశలో నగరాలపై ఫోకస్
ఏటా రాష్ట్రంలో 6 వేల ఈవీ కార్లు, 40 వేల టూవీలర్లు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ఈ జోరును గమనించిన అధికారులు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ‘ఛార్జింగ్ నెట్వర్క్’ను సిద్ధం చేస్తున్నారు. హైవేల తర్వాత, నగరాల్లో ఛార్జింగ్ సదుపాయాలను పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఏలూరు నగరాల్లో రెండో దశలో మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.