kumaraswamy: కుమారస్వామి గారూ.. సహకరించండి ప్లీజ్: రజనీకాంత్
- కాలా సినిమాను అడ్డుకోలేమన్న హైకోర్టు
- థియేటర్ల వద్ద భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్న కోర్టు
- కన్నడ భాషలో సీఎంకు రిక్వెస్ట్ పంపిన రజనీ
కర్ణాటకలో 'కాలా' సినిమా విడుదలకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి కుమారస్వామికి సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ విన్నవించారు. ఈ ఉదయం కన్నడ భాషలో కుమారస్వామికి ఓ సందేశం పంపారు. సినిమా విడుదలయ్యే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని తన సందేశంలో కోరారు.
కావేరి జలాల వివాదం నేపథ్యంలో 'కాలా' సినిమాను కర్ణాటక ఫిలిం ఛాంబర్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంపై చిత్ర యూనిట్ కర్ణాటక హైకోర్టు తలుపు తట్టింది. పిటిషన్ ను విచారించిన కోర్టు... సినిమా విడుదలను అడ్డుకోలేమని క్లియరెన్స్ ఇచ్చింది. థియేటర్ల వద్ద భద్రతను కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపింది.
ఈ తీర్పుపై కుమారస్వామి స్పందిస్తూ, కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడమే మంచిదని నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు సూచిస్తున్నానని తెలిపారు. ఒక కన్నడిగుడిగా తాను చెబుతున్నానని... ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదలైతే, అనవసరమైన వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. పరిస్థితులు కొంచెం చక్కబడ్డాక విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే, సినిమా ప్రదర్శనకు సహకరించాలంటూ కుమారస్వామికి రజనీకాంత్ విన్నవించారు.