రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ వల్ల మెదడుపై ప్రభావం ఉంటుందా?

రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ వల్ల మెదడుపై ప్రభావం ఉంటుందా?

Does roller coaster ride affect the brain
  • కాలిఫోర్నియాలో ఎక్స్‌2 రోలర్‌ కోస్టర్‌పై కేసులు
  • 100 మందికిపైగా గాయాలైనట్లు ఫిర్యాదులు
  • రైడ్‌లో వేగం, ఆకస్మిక మలుపుల వల్ల మెడ, మెదడుపై ప్రభావం
  • తల వేగంగా కదలడం వల్ల మెదడుపై ఒత్తిడి
  • అరుదుగా మెదడులో రక్తస్రావం
ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్లడం.. క్షణాల్లో కిందికి జారిపడటం.. మలుపుల మీద మలుపులు తిరగడం.. ఇదే రోలర్‌ కోస్టర్‌ థ్రిల్‌. కానీ అదే వేగం, అదే ఉత్కంఠ కొన్నిసార్లు శరీరంపై తీవ్ర ప్రభావం చూపొచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ రోలర్‌ కోస్టర్‌పై వచ్చిన ఫిర్యాదులు ఇప్పుడు ఈ అంశంపై మళ్లీ చర్చకు తెరతీశాయి.

100 మందికి పైగా ఫిర్యాదులు
కాలిఫోర్నియాలోని సిక్స్‌ ఫ్లాగ్స్‌ మ్యాజిక్‌ మౌంటెన్‌లో ఉన్న ‘ఎక్స్‌2’ రోలర్‌ కోస్టర్‌పై పలువురు కేసులు వేశారు. ఈ రైడ్‌ కారణంగా మెదడుకు గాయాలయ్యాయని బాధితులు ఆరోపించారు. 100 మందికిపైగా ఇదే తరహా సమస్యలను నివేదించినట్లు వారి తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. జులై 12 నుంచి ఈ రైడ్‌ను మూసివేశారు.

కొంతమంది తీవ్ర తలనొప్పి, అయోమయం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లారు. ఓ మహిళకు మెదడులో రక్తస్రావం జరగడంతో అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

అసలు గాయం ఎలా అవుతుంది?
రోలర్‌ కోస్టర్‌లో వేగం ఒక్కసారిగా పెరగడం, వెంటనే తగ్గడం సాధారణమే. దీంతో తల కూడా వేగంగా కదులుతుంది. ముఖ్యంగా తల ముందుకు, వెనక్కి, పక్కలకు బలంగా కదలడం మెడపై ఒత్తిడిని పెంచుతుంది.

కొన్ని రైడ్లలో సీట్లు కూడా తిరుగుతుంటాయి. ఎక్స్‌2లో ప్రయాణికుల సీట్లు 360 డిగ్రీలు తిరుగుతూ ముందుకు సాగుతాయి. ఇలాంటి భ్రమణ కదలికలు తలపై అదనపు ప్రభావం చూపొచ్చు.

మెదడులో రక్తస్రావం.. అరుదైన ముప్పు
చాలా సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు కనిపించకపోయినా, అరుదుగా మెదడు చుట్టూ రక్తస్రావం, రక్తనాళాలకు గాయాల వంటి సమస్యలు నమోదయ్యాయి. రక్తనాళం చిట్లితే రక్తం గడ్డకట్టి స్ట్రోక్‌కు దారితీసే అవకాశం కూడా ఉంటుంది.

మెడ, వెన్నెముకకు గాయాలు కూడా సంభవించొచ్చు. ముఖ్యంగా మెడ సమస్యలు, గతంలో తలకు గాయాలు, నరాల సంబంధిత సమస్యలు ఉన్నవారు హై-ఇంటెన్సిటీ రైడ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

రైడ్‌ తర్వాత ఈ లక్షణాలుంటే?
రోలర్‌ కోస్టర్‌ నుంచి దిగిన తర్వాత తీవ్రమైన తలనొప్పి, పదేపదే వాంతులు, తల తిరగడం, అయోమయం, స్పృహ కోల్పోవడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, మాట తడబడటం, చూపు సమస్యలు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సాధారణంగా వచ్చేదే అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు.

థ్రిల్‌ కోసం రైడ్‌ ఎక్కే ముందు పార్క్‌ నిర్వాహకులు ఇచ్చే వయసు, ఎత్తు, ఆరోగ్య హెచ్చరికలను తప్పకుండా పాటించడం మంచిది.
Advertisement
X2 Roller Coaster
Six Flags Magic Mountain
Roller coaster brain injury
California amusement park lawsuit
Roller coaster health risks
Brain hemorrhage symptoms

More Telugu News