బరువు తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాల్సిందేనా?

బరువు తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాల్సిందేనా?

Should you stop eating rice at night to lose weight
  • రాత్రి అన్నం తినడం వల్ల మాత్రమే బరువు పెరగరంటున్న నిపుణులు
  • రోజువారీ కేలరీల సమతుల్యత కీలకమని సూచన
  • అన్నం మోతాదుపై దృష్టి పెట్టాలని సలహా
  • పప్పు, పనీర్‌, చికెన్‌ వంటి ప్రొటీన్‌ వనరులతో అన్నం తినాలని సూచన
  • రాత్రి అన్నాన్ని పూర్తిగా మానాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
బరువు తగ్గాలని అనుకున్న వెంటనే చాలామందికి గుర్తొచ్చే మొదటి నియమం.. “రాత్రిపూట అన్నం మానేయాలి”. అన్నం తింటే బరువు పెరుగుతామని, ముఖ్యంగా రాత్రివేళ తిన్న అన్నం కొవ్వుగా మారుతుందని చాలామంది నమ్ముతుంటారు. దీంతో డిన్నర్‌లో అన్నానికి బదులుగా రొట్టె, సలాడ్‌ లేదా మరేదైనా తినడం మొదలుపెడతారు. కానీ నిజంగా రాత్రి అన్నం తినడమే బరువు పెరగడానికి కారణమా? నిపుణులు ఏం చెబుతున్నారు?

రాత్రి అన్నం తింటే బరువు పెరుగుతారా?
పోషకాహార నిపుణురాలు రూపాలి దత్తా ప్రకారం.. రాత్రిపూట అన్నం తినడం ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదు. రోజంతా మనం తీసుకునే కేలరీలు, ఖర్చు చేసే కేలరీల మధ్య ఉండే సమతుల్యతే బరువు నిర్వహణలో కీలకం. మన శరీరం ఖర్చు చేసే దానికంటే తక్కువ కేలరీలు తీసుకుంటే.. రాత్రి భోజనంలో అన్నం ఉన్నంత మాత్రాన బరువు పెరగదు.

అయితే ఎంత అన్నం తినాలి?
అన్నం తినొద్దని చెప్పడం కంటే మోతాదుపై దృష్టి పెట్టడం ముఖ్యమని రూపాలి దత్తా సూచిస్తున్నారు. ఒక భోజనంలో అర కప్పు నుంచి ఒక కప్పు వరకు వండిన అన్నం తీసుకోవచ్చు. అయితే అన్నాన్ని ఒక్కటే తినకుండా పప్పు, పనీర్‌, చికెన్‌ వంటి ప్రొటీన్‌ ఆహారాలతో పాటు కూరగాయలు చేర్చుకోవడం మంచిదని ఆమె చెబుతున్నారు. ఇలా అన్నం, ప్రొటీన్‌, కూరగాయలతో భోజనం చేసుకుంటే.. ఆహారం మరింత సమతుల్యంగా ఉంటుంది.

సింగిల్‌ పాలిష్డ్‌, చేతితో దంచిన బియ్యాన్ని ఎంచుకుంటే మేలు. రాత్రి అన్నం తినేవారు.. భోజనానికి, నిద్రకు మధ్య సుమారు రెండు గంటల విరామం ఉండేలా చూసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా అన్నం ఎంత తింటున్నామనేది ముఖ్యం.. అతిగా తినకపోవడం కీలకం.

అంతేకాదు.. అందరికీ ఒకటే రకం బియ్యం సరిపోతుందని చెప్పలేం. మన ప్రాంతంలో సాధారణంగా లభించే బియ్యాన్ని తీసుకుంటూ.. దాన్ని సమతుల్యమైన భోజనంలో భాగం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

అన్నమా.. రొట్టెనా?
బరువు తగ్గాలని అనుకునేవాళ్లు చాలామంది అన్నానికి బదులుగా రొట్టె తినడం మొదలుపెడతారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం.. అన్నం, రొట్టెల్లో ఒకటే తప్పనిసరిగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు.

ఎవరికి ఏది సులభంగా జీర్ణమవుతుంది? మొత్తం భోజనంలో మిగతా ఆహారం ఎలా ఉంది? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్నం తింటున్నారా? రొట్టె తింటున్నారా? అన్నదానికంటే.. మోతాదును నియంత్రించడం, భోజనంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.

మరి బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
నిపుణుల సూచనలను చూస్తే.. బరువు తగ్గడం కోసం రాత్రిపూట అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. ఎంత తింటున్నారు? దేనితో కలిపి తింటున్నారు? రోజంతా తీసుకునే ఆహారం ఎలా ఉంది? అనేదే ముఖ్యం.
Advertisement
Rupali Datta
Weight Loss Tips
Rice at Night
Healthy Dinner
Calorie Management
Nutrition Advice

More Telugu News