పౌరసత్వం కోసం అమెరికాలో ప్రసవం.. ఇకపై కఠిన నిబంధనలు!

పౌరసత్వం కోసం అమెరికాలో ప్రసవం.. ఇకపై కఠిన నిబంధనలు!

United States tightens birth tourism rules for citizenship seekers
  • నిర్వాహకులు, మధ్యవర్తులపై చర్యలు
  • సహకరించే వైద్య సంస్థలపైనా వేటు
  • వీసా మోసాలపై కొత్త ఫిర్యాదు పోర్టల్‌
  • నకిలీ ఉద్యోగాలు, పెళ్లిళ్లపై ఫిర్యాదు చేసే అవకాశం
  • మోసం తేలితే వీసా రద్దు చేసే అవకాశం
అమెరికాలో బిడ్డను కని.. ఆ బిడ్డకు అక్కడి పౌరసత్వం ఇప్పించాలనుకునే వారికి ఇక కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి ‘బర్త్‌ టూరిజం’ను అడ్డుకునేందుకు అమెరికా కొత్త వీసా ఆంక్షలు ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని వ్యాపారంగా మార్చుకున్న సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోనుంది.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ విషయాన్ని ప్రకటించారు. బర్త్‌ టూరిజం కోసం విదేశీయులను అమెరికాకు పంపించే సంస్థల యజమానులు, నిర్వాహకులు, మేనేజర్లను లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలిపారు. వీసా దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు ఇవ్వాలని చెప్పే మధ్యవర్తులపైనా వేటు తప్పదని స్పష్టం చేశారు.

విదేశీయులు అమెరికాలో ప్రసవించేలా తెలిసి సహకరించే వైద్య సేవల సంస్థలపైనా చర్యలు ఉండనున్నాయి. ఈ వ్యవహారంలో మెడికెయిడ్‌ ప్రయోజనాలను మోసపూరితంగా వాడినా చర్యలు తప్పవని అమెరికా తెలిపింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకూ ఆంక్షలు వర్తించే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు వీసా మోసాలపై ఫిర్యాదు చేసేందుకు అమెరికా కొత్త ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. నకిలీ పత్రాలు, తప్పుడు ప్రయాణ వివరాలు, బోగస్‌ పెళ్లిళ్లు, కల్పిత ఉద్యోగ ఆఫర్ల వంటి మోసాలపై ప్రజలు సమాచారం ఇవ్వొచ్చు. బర్త్‌ టూరిజం వ్యవహారాలనూ ఫిర్యాదు చేయవచ్చు.

అందిన సమాచారాన్ని అధికారులు పరిశీలిస్తారు. మోసం చేసినట్లు తేలితే వీసా రద్దు చేయొచ్చు. అవసరమైతే తదుపరి దర్యాప్తు కోసం చట్టబద్ధ సంస్థలకు కేసును అప్పగిస్తారు.

అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం కల్పించే నిబంధనను ఆసరాగా చేసుకొని కొందరు బర్త్‌ టూరిజం వ్యాపారం చేస్తున్నారు. ప్రయాణం, వసతి, ప్రసవ ఏర్పాట్లను కలిపి ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. ఈ తరహా మోసాలను అడ్డుకోవడమే తాజా చర్యల లక్ష్యమని రూబియో తెలిపారు.
Advertisement
United States
Birth Tourism
US Visa Restrictions
Marco Rubio
US Citizenship Laws
Visa Fraud Reporting

More Telugu News