బొత్స సత్యనారాయణ కూతురు అనూషకు వైసీపీలో కీలక పదవి
- ఉత్తరాంధ్ర వైసీపీలో కొత్త తరం నాయకత్వం
- క్రియాశీల రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ కుమార్తె
- భీమిలి వైసీపీ సమన్వయకర్తగా బొత్స అనూష నియామకం
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ప్రత్యక్ష, క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అనూషను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. భీమిలి పరిధిలో క్షేత్రస్థాయి నాయకులను, విస్తృత కేడర్‌ను సమాయత్తం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కీలక బాధ్యతను ఆమెకు అప్పగించారు.
గతంలో ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ పలు ఉచిత వైద్య, సామాజిక కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన అనూష, తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అధికారికంగా భీమిలి సమన్వయకర్తగా నియామకం కావడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ తరఫున కొత్త తరం నాయకత్వం రూపుదిద్దుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.