కేటీఆర్ ఫామ్‌హౌస్ వైపు బయలుదేరిన కాంగ్రెస్ ఎంపీలు, కీలక నేతలు.. భారీగా పోలీసుల మోహరింపు
- జన్వాడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత
- ప్రజాభవన్ నుంచి అక్కడకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలు
- భూములను ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణ
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధించినదిగా చెబుతున్న జన్వాడ ఫామ్‌హౌస్, ఆ పరిసర ప్రాంతాల్లోని భూముల కేటాయింపులపై నిజానిజాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నాయకులు ప్రజాభవన్ నుంచి అక్కడికి బయలుదేరారు. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల కుటుంబాలు నిబంధనలకు విరుద్ధంగా భూములను ఆక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ బృందం ఈ పర్యటనకు పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ నేతల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం ఫామ్‌హౌస్ పరిసరాల్లో ముందస్తుగా భారీగా బలగాలను మోహరించింది. మార్గమధ్యంలో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు, జన్వాడ ఫామ్‌హౌస్ భూమి తన సొంత ఆస్తి అని, కేటీఆర్‌కు అందులో ఎటువంటి యజమాని హక్కులు లేవని, కేవలం లీజుకు మాత్రమే ఇచ్చానని యజమాని ప్రదీప్ రెడ్డి నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.