2030 నాటికి ఏఐతో ప్రపంచం అంతం తప్పదా? టాప్‌ టెక్‌ కంపెనీ సీఈఓ ఏమన్నారంటే..

2030 నాటికి ఏఐతో ప్రపంచం అంతం తప్పదా? టాప్‌ టెక్‌ కంపెనీ సీఈఓ ఏమన్నారంటే..

Jensen Huang on whether AI will end the world by 2030
  • 2030 నాటికి ఏఐతో ప్రపంచం అంతమయ్యే అవకాశం లేదన్న హువాంగ్‌
  • అలాంటి విపత్తుకు అవకాశం ‘సున్నా శాతం’ అని వివరణ
  • సిద్ధంగా లేని ఏఐ ఉత్పత్తులను విడుదల చేయొద్దని సూచన
  • ఏఐ అభివృద్ధిని కంపెనీలు వేగవంతం చేయాలని హితవు
  • ఏఐ భద్రతపై టెక్‌ రంగంలో భిన్నాభిప్రాయాలు
కృత్రిమ మేధ (ఏఐ)పై రోజురోజుకూ ఆందోళనలు పెరుగుతున్నాయి. అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు అదుపు తప్పితే మానవాళికి పెను ముప్పు తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే 2030 నాటికి ఏఐ కారణంగా ప్రపంచం అంతమయ్యే అవకాశమే లేదని ఎన్విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్‌ స్పష్టం చేశారు. అలాంటి విపత్తు సంభవించే అవకాశం ఏమాత్రం లేదని అని తేల్చి చెప్పారు.

హువాంగ్‌ తాజాగా సీబీఎస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల ప్రపంచం అంతమవుతుందన్న వాదనలో అర్థం లేదన్నారు. కొందరు చేస్తున్న హెచ్చరికల వెనుక రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు లేదా ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశం ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు.

ఏఐ అభివృద్ధిని కంపెనీలు వేగవంతం చేయాలని హువాంగ్‌ అన్నారు. అయితే భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పూర్తిగా సిద్ధం కాని, సురక్షితంగా లేని ఏఐ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావద్దని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఏఐ అభివృద్ధి వేగంపై టెక్‌ రంగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సురక్షిత వ్యవస్థల కోసం మరిన్ని జాగ్రత్తలు అవసరమని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌, ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయి సహా పలువురు చెబుతున్నారు. ఏఐను అర్థం చేసుకుని నియంత్రించే ప్రయత్నాల కంటే దాని అభివృద్ధి వేగం పెరిగిపోవచ్చని అమోడెయి ఈ నెలలో హెచ్చరించారు.

ఏఐపై కొత్త చట్టాలు అవసరం లేదన్న అభిప్రాయాన్ని హువాంగ్‌ గతంలోనూ వ్యక్తం చేశారు. భద్రత అనేది ఆయా కంపెనీల ఇంజినీరింగ్‌ బాధ్యతగా చూడాలని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల మాత్రం అత్యాధునిక ఏఐ అభివృద్ధి మానవాళికి మేలు చేసేలా, మనుషుల నియంత్రణలోనే ఉండేలా సాగాలని ఇటీవల అన్నారు.
Advertisement
Jensen Huang
NVIDIA
Artificial Intelligence
AI Safety
AI World End 2030
Tech CEO News

More Telugu News