హెచ్‌-1బీపై ట్రంప్‌ మరో షాక్‌.. కంపెనీలకు కొత్త కష్టాలు!

హెచ్‌-1బీపై ట్రంప్‌ మరో షాక్‌.. కంపెనీలకు కొత్త కష్టాలు!

Donald Trump gives another shock on H-1B visas and new troubles for companies
  • హెచ్‌-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు
  • లేఆఫ్స్‌ చేసే సంస్థలపై కఠిన పరిశీలన
  • 30 రోజుల్లో పాత దరఖాస్తుల సమీక్ష
  • ఇతర శాఖల సమాచారంతో హెచ్‌-1బీ కేసుల పరిశీలన
  • కొన్ని దరఖాస్తులకే 1 లక్ష డాలర్ల ఫీజు వర్తింపు
హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని హెచ్‌-1బీ దరఖాస్తులకు 1 లక్ష డాలర్ల ఫీజును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో హెచ్‌-1బీ వీసాను స్పాన్సర్‌ చేసే కంపెనీలు అమెరికా ఉద్యోగులను తొలగిస్తున్నాయా? అనే అంశం నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.

హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే సంస్థ ఇటీవల అమెరికా ఉద్యోగులను తొలగించిందా? భవిష్యత్తులోనూ ఉద్యోగాల్లో కోతలు పెట్టబోతోందా? ఇకపై అధికారులు పరిశీలిస్తారు. హెచ్‌-1బీ ఉద్యోగులతో సమానమైన పనులు చేసే అమెరికన్లను తొలగించినా దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

అయితే ఉద్యోగులను తొలగించినంత మాత్రాన హెచ్‌-1బీ దరఖాస్తును తిరస్కరించాలని ఆదేశాల్లో చెప్పలేదు. దరఖాస్తు పరిశీలనలో ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే స్పష్టం చేశారు.

ఇప్పటికే దాఖలైన లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్లను సమీక్షించాలని కార్మిక శాఖను ఆదేశించారు. 30 రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించాలి. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై తదుపరి చర్యలు అవసరమా అన్నది పరిశీలించనున్నారు.

అమెరికా విదేశాంగ, కార్మిక, హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖలు ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేయాలి. వేతనాలు, ఉద్యోగాలు, విద్య, పరిశ్రమలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలనలో ఉపయోగించాలి.

2025 సెప్టెంబర్‌ 19న విధించిన 1 లక్ష డాలర్ల ఫీజును కొనసాగిస్తూ ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఫీజు కొన్ని హెచ్‌-1బీ దరఖాస్తులకు వర్తిస్తుంది. మినహాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలను తాజా ప్రకటనలో వెల్లడించలేదు.

వైట్‌హౌస్‌ ప్రకారం.. భారీ ఐటీ ఔట్‌సోర్సింగ్‌ సంస్థల హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గాయి. కాన్సులర్‌ ప్రాసెసింగ్‌ అభ్యర్థనలు దాదాపు 97 శాతం పడిపోయాయి.
Advertisement
Donald Trump
H1B Visa
US Immigration
IT Outsourcing
Labor Condition Application
US Jobs

More Telugu News