ఇమ్రాన్ ఖాన్ కోసం కదిలిన క్రికెట్ దిగ్గజాలు.. ఏడుగురు ఆసీస్ మాజీ కెప్టెన్ల లేఖ

ఇమ్రాన్ ఖాన్ కోసం కదిలిన క్రికెట్ దిగ్గజాలు.. ఏడుగురు ఆసీస్ మాజీ కెప్టెన్ల లేఖ

Imran Khan support from cricket legends seven former Australian captains write letter
  • ఇమ్రాన్ ఖాన్ కోసం ఆసీస్ విదేశాంగ మంత్రికి లేఖ
  • ఏడుగురు మాజీ కెప్టెన్ల మానవతా విజ్ఞప్తి
  • ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన క్రికెట్ దిగ్గజాలు
  • ఇప్పటికే గవాస్కర్, కపిల్ దేవ్ వంటి వారి మద్దతు
  • తండ్రిని చంపేస్తారంటూ ఇమ్రాన్ కుమారుల ఆవేదన
పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వర్గాల నుంచి ఆందోళన పెరుగుతోంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు. 

తాజాగా ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు ఆయన విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ తమ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై అలెన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, స్టీవ్ వా, మార్క్ టేలర్, కిమ్ హ్యూస్, బెలిండా క్లార్క్ వంటి దిగ్గజాలు సంతకాలు చేశారు.

తాము రాజకీయ నాయకులుగానో, దౌత్యవేత్తలుగానో ఈ లేఖ రాయడం లేదని, తోటి మాజీ కెప్టెన్‌గా మానవతా విలువలకే కట్టుబడి స్పందిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న రాజకీయ, న్యాయపరమైన కేసులతో తమకు సంబంధం లేదని, అది పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. కానీ, జైలులో ఉన్న ఏ వ్యక్తి ఆరోగ్యం గురించైనా ఆందోళన చెందడం ప్రాథమిక మానవత్వమని వారు తమ లేఖలో అభిప్రాయపడ్డారు.

ఇమ్రాన్ ఖాన్ కోసం అంతర్జాతీయ క్రికెటర్లు గళం విప్పడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల గ్రెగ్ చాపెల్ ప్రారంభించిన ఒక పిటిషన్‌పై సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి భారత దిగ్గజాలతో పాటు మొత్తం 21 మంది మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు సంతకాలు చేశారు. 

సర్ అలిస్టర్ కుక్, మైఖేల్ అథర్టన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, నాజర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇమ్రాన్‌కు కుటుంబ సభ్యులను కలిసేందుకు, స్వతంత్ర వైద్య పరీక్షలు జరిపించేందుకు అనుమతించాలని వారు పాక్ ప్రభుత్వాన్ని కోరారు.

ఆస్ట్రేలియా ప్రస్తుత టెస్ట్, వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇమ్రాన్‌కు మద్దతుగా నిలిచాడు. "కోర్టు ఆదేశించిన వైద్య పరీక్షలు పూర్తి చేయడానికి, కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతించాలని ఆశిస్తున్నాను. ఏ వ్యక్తికైనా లభించాల్సిన గౌరవం ఇమ్రాన్ ఖాన్‌కు దక్కాలి" అని తన 'ఎక్స్‌' ఖాతాలో పేర్కొన్నాడు. 

మరోవైపు, ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "జైల్లోనే మా నాన్నను చంపేయాలని వారు చూస్తున్నారు. అందుకే ఆయనను వీలైనంత కాలం జైల్లో ఉంచి, ఆయన గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు" అని ఇమ్రాన్ కుమారుడు సులేమాన్ ఈసా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే మూడేళ్లకు పైగా జైలులో ఉన్నారు. ఆయన కుడి కంటి చూపు గణనీయంగా తగ్గిపోయిందని వస్తున్న వార్తలు క్రికెట్ వర్గాల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి.
Advertisement
Imran Khan
Australian Cricket Captains
Penny Wong
Pakistan Prison
Greg Chappell
Human Rights

More Telugu News