దక్షిణాఫ్రికా పర్యటన.. మహాత్మాగాంధీ మునిమనవడితో అయ్యన్నపాత్రుడు భేటీ
- దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న అయ్యన్నపాత్రుడు
- డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్ సందర్శన
- గాంధీ మునిమనవడిని సత్కరించిన అయ్యన్న
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు డర్బన్ సమీపంలోని చారిత్రాత్మక 'ఫీనిక్స్ సెటిల్‌మెంట్'ను సందర్శించారు. మహత్మాగాంధీ సత్యాగ్రహ పోరాటానికి పునాది వేసిన ఈ పవిత్ర భూమిని సందర్శించడం తనకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని, పవిత్ర యాత్ర లాంటి అనుభవాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అక్కడి 'సర్వోదయ హౌస్'లో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ పర్యటనలో గాంధీజీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రామ్ గోబిన్‌ను ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలకు ప్రతిరూపమైన కలంకారీ శాలువాతో సత్కరించి, అనకాపల్లి జిల్లా ప్రత్యేకత అయిన ఏటికొప్పాక హస్తకళాకృతిని జ్ఞాపికగా బహూకరించారు. ఆ ప్రాంతంలో విలువల ఆధారిత విద్యను అందిస్తున్న కస్తూర్బా పాఠశాల యాజమాన్యాన్ని, తరతరాలుగా గాంధేయవాదాన్ని ప్రచారం చేస్తున్న గాంధీ కుటుంబ సభ్యుల కృషిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా కొనియాడారు.