ఈ ఏడాది యాపిల్ డబుల్ ధమాకా.. ఐఫోన్ 18తో పాటు ఫోల్డబుల్ ఫోన్!

ఈ ఏడాది యాపిల్ డబుల్ ధమాకా.. ఐఫోన్ 18తో పాటు ఫోల్డబుల్ ఫోన్!

Apple Double Bonanza iPhone 18 and Foldable Phone Launch
  • ఈ ఏడాది భారత్‌లో భారీగా పెరగనున్న ఐఫోన్ షిప్‌మెంట్లు
  • మార్కెట్లోకి రానున్న యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్
  • విడుదలలో సరికొత్త వ్యూహం... విడతల వారీగా ఐఫోన్ 18 మోడళ్లు
  • ఏఐ నిపుణుల కొరత ఉన్నప్పటికీ దూకుడుగా యాపిల్ ప్రణాళికలు
  • ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లకు మంచి డిమాండ్ అంచనా
టెక్ దిగ్గజం యాపిల్, 2026 సంవత్సరంలో భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐఫోన్ 18 సిరీస్‌ను విడుదల చేయనుండగా, అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేస్తుందని ప్రముఖ టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ 'సైబర్ మీడియా రీసెర్చ్' (సీఎంఆర్‌) అంచనా వేసింది. ముఖ్యంగా యాపిల్ నుంచి వ‌స్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ కూడా ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో అమ్మకాలు గణనీయంగా పెరగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సీఎంఆర్‌ ప్రాథమిక అంచనాల ప్రకారం.. 2026లో సాధారణ త్రైమాసికాల్లో యాపిల్ షిప్‌మెంట్ల వృద్ధి సగటున 20 శాతం ఉండగా, కొత్త ఐఫోన్ల విడుదల సమయంలో (లాంచ్ క్వార్టర్) ఇది ఏకంగా 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే లాంచ్ క్వార్టర్‌లో దాదాపు 4 శాతం వృద్ధి నమోదవుతుందని సంస్థ అంచనా వేసింది. ఈ వృద్ధిలో కొత్త మోడళ్ల పాత్ర కీలకంగా ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో మోడల్ వాటా 8శాతం వరకు ఉండగా, అత్యంత ఖరీదైన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వాటా 5 శాతం వరకు ఉండవచ్చని సీఎంఆర్‌ నివేదిక పేర్కొంది.

ఫోల్డబుల్ ఐఫోన్‌పై మార్కెట్‌లో భారీ అంచనాలు 
ఈ ఏడాది యాపిల్ విడుదల చేయబోయే ఉత్పత్తుల్లో అత్యంత కీలకం కానున్న ఫోల్డబుల్ ఐఫోన్‌పై మార్కెట్‌లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలోకి యాపిల్ ప్రవేశించడం కంపెనీకి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. విడుదలైన తొలి త్రైమాసికంలోనే భారత ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ కొత్త ఐఫోన్ ఫోల్డ్ దాదాపు 24 శాతం వాటాను కైవసం చేసుకునే సత్తా ఉందని అంచనా. ఎప్పటినుంచో యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ఆ సంస్థ అభిమానుల నుంచి దీనికి భారీ డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

యాపిల్ ఈసారి తన ఉత్పత్తుల విడుదలలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అన్ని మోడళ్లను ఒకేసారి విడుదల చేసే యాపిల్, ఈసారి విడతల వారీగా లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఖరీదైన, ప్రీమియం మోడళ్లయిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్, ఫోల్డబుల్ ఐఫోన్‌లను పండగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది చివరి త్రైమాసికంలో (Q4) విడుదల చేయనుంది. 

ఇక, బేస్ మోడల్ అయిన ఐఫోన్ 18ను సాధారణంగా అమ్మకాలు తక్కువగా ఉండే వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో (Q1) మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వ్యూహం ద్వారా ఆదాయాన్ని ఒకే త్రైమాసికంలో కేంద్రీకరించకుండా, ఏడాది పొడవునా సమంగా విస్తరించాలని యాపిల్ భావిస్తోంది.

ప్రస్తుతం యాపిల్ సంస్థ ఏఐ నిపుణుల వలసలు, నాయకత్వ మార్పులు వంటి అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, తమ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవసీకి ఇచ్చే ప్రాధాన్యతను కొనసాగిస్తూనే, సిరి (Siri) అసిస్టెంట్‌ను పునరుద్ధరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కెమెరా, ప్రొడక్టివిటీ వంటి ప్రధాన ఫీచర్లలోకి మరింత లోతుగా తీసుకువస్తోంది. ఈ కొత్త వ్యూహాలు, ఉత్పత్తులతో భారత మార్కెట్‌లో యాపిల్ తన హవాను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.
Advertisement
Apple
iPhone 18
Foldable iPhone
iPhone 18 Pro Max
Apple India Market
CyberMedia Research

More Telugu News