శాస్త్రవేత్తలకే సాధ్యం కాని సమస్యను ఛేదించిన టీనేజర్‌.. కొబ్బరి పీచుతో అద్భుత ప్రయోగం!

శాస్త్రవేత్తలకే సాధ్యం కాని సమస్యను ఛేదించిన టీనేజర్‌.. కొబ్బరి పీచుతో అద్భుత ప్రయోగం!

Vera Wang Hawaii student discovers plastic eating fungus in coconut waste
  • హైస్కూల్‌ విద్యార్థిని వెరా వాంగ్‌ అరుదైన ఆవిష్కరణ
  • కొబ్బరి వ్యర్థాలతో వాటర్‌ ఫిల్టర్‌ తయారీ
  • మైక్రోప్లాస్టిక్స్‌, రసాయనాలను పట్టుకునే ఫిల్టర్‌
  • కొబ్బరి ఫంగస్‌ ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసినట్లు గుర్తింపు
  • సముద్ర కాలుష్యానికి కొత్త సహజ పరిష్కారంపై ఆశలు
సముద్రాల్లో పేరుకుపోతున్న మైక్రోప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎలా తగ్గించాలి? పర్యావరణ శాస్త్రవేత్తలు ఏళ్లుగా పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఓ హైస్కూల్‌ విద్యార్థిని మాత్రం సమస్యకు పరిష్కారాన్ని కొబ్బరి పీచులోనే వెతికింది. హవాయిలోని ఈస్ట్‌ హొనొలులుకు చెందిన వెరా వాంగ్‌ చేసిన పరిశోధన ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది. కొబ్బరి వ్యర్థాలతో తయారు చేసిన ఫిల్టర్‌తో మైక్రోప్లాస్టిక్స్‌ను పట్టుకోవడమే కాదు.. వాటిని కరిగించగల ఫంగస్‌ను కూడా ఆమె గుర్తించింది.

కొబ్బరి వ్యర్థాలతో ప్రయోగం
కైసర్‌ హైస్కూల్‌లో చదువుతున్న వెరా.. పదో తరగతిలోనే సముద్ర కాలుష్యంపై దృష్టి పెట్టింది. కొబ్బరి పీచు, ఇతర కొబ్బరి వ్యర్థాలతో ఓ వాటర్‌ ఫిల్టర్‌ను రూపొందించింది. సంప్రదాయ పాలినేషియన్‌ అల్లిక పద్ధతుల నుంచి స్ఫూర్తి పొందింది. ఈ ఫిల్టర్‌ నీటిలో తేలియాడే మైక్రోప్లాస్టిక్స్‌, సన్‌స్క్రీన్‌ రసాయనాలను సమర్థంగా పట్టుకున్నట్లు గుర్తించింది.

అసలు సీక్రెట్‌ ఫంగస్‌లోనే!
వ్యర్థాలను పట్టుకోవడం మాత్రమే సరిపోదని వెరా భావించింది. ఫిల్టర్‌లో చిక్కుకున్న వ్యర్థాలను పూర్తిగా తొలగించే మార్గంపై పరిశోధన మొదలుపెట్టింది. కొబ్బరి పీచు రంధ్రాల నిర్మాణం గాలి, నీటి ప్రసరణకు అనుకూలంగా ఉంటుందని గుర్తించింది. దీంతో అందులో ఉండే సూక్ష్మజీవులపై దృష్టి పెట్టింది.

హవాయి యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి చేసిన ప్రయోగాల్లో కొబ్బరి తంతువులపై సహజంగా పెరిగే కొన్ని ఫంగస్‌ జాతులు బయటపడ్డాయి. ఇవి సన్‌స్క్రీన్‌లోని కొన్ని రసాయనాలతో పాటు ప్లాస్టిక్‌ పదార్థాలను కూడా జీవక్రియ ద్వారా విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

సైన్స్‌లో కొత్త జాతుల జాడ!
కొబ్బరి పీచులోని సహజ టానిన్‌ పదార్థాలు ఈ ఫంగస్‌ పెరుగుదలకు తోడ్పడుతున్నట్లు ప్రయోగాల్లో తేలింది. అంతేకాదు.. వెరా గుర్తించిన కొన్ని ఫంగస్‌ జాతుల జన్యు నమూనాలు ప్రపంచంలోని అతిపెద్ద జన్యు డేటాబేస్‌లోని రికార్డులతో సరిపోలలేదు. దీంతో ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలియని ఫంగస్‌ జాతులు కావచ్చనే ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

ఈ పరిశోధనకు హవాయి స్టేట్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఫెయిర్‌లో మైక్రోబయాలజీ విభాగంలో మొదటి బహుమతి దక్కింది. మెక్‌ఇనెర్నీ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌ కూడా లభించింది. ఈ విజయంతో అంతర్జాతీయ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఫెయిర్‌కు వెరా ఎంపికైంది.

కొబ్బరి వ్యర్థాలతో ప్రారంభమైన ఓ చిన్న ప్రయోగం.. సముద్ర కాలుష్యానికి సహజ పరిష్కారం చూపించే పరిశోధనగా మారింది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయగలిగితే మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడంలో ఉపయోగపడే అవకాశముంది.
Advertisement
Vera Wang
Microplastic pollution
Coconut fiber water filter
Plastic eating fungus
Hawaii State Science Fair
Marine conservation

More Telugu News