'ఇది నీ పని కాదు'.. పాపరాజీపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం

  • ఫొటోలు తీసేందుకు ఎగబడిన  ఫొటోగ్రాఫర్లు
  • బిగ్‌బాస్ 20 సెట్‌లో ఫొటోగ్రాఫర్‌పై ఫైర్ అయిన సల్మాన్ ఖాన్
  • 'బాబా' అని పిలవడంతో అసహనం వ్యక్తం చేసిన స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి పాపరాజీపై తన అసహనాన్ని ప్రదర్శించాడు. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ 20' సెట్స్‌లో ఓ ఫొటోగ్రాఫర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇది నీ పని కాదు' అంటూ ఫొటోగ్రాఫర్‌కు చురకలంటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్న బిగ్ బాస్ 20 షో ప్రీమియర్ ఎపిసోడ్ షూటింగ్ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కౌబాయ్ తరహా దుస్తుల్లో స్టేజ్‌పైకి వచ్చిన సల్మాన్‌ను ఫొటోలు తీసేందుకు పాపరాజీలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరు ఫొటోగ్రాఫర్లు ఆయన్ను 'బాబా' అని పిలుస్తూ ఫొటోలకు పోజులివ్వమని కోరారు.

దీంతో సల్మాన్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. "బాబా? యహ్ తేరా కామ్ నహీ హై. ముఝే కెమెరా కే ఆగే ఆనే కీ కోయీ జరూరత్ నహీ హై" (బాబా? ఇది నీ పని కాదు. నేను కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదు) అంటూ తీవ్రంగా స్పందించాడు. వారు పదేపదే "ఫొటోస్.. ఫొటోస్.." అని అడగడంతో మరింత విసుక్కున్నాడు.

సల్మాన్‌కు, పాపరాజీలకు మధ్య పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే, ఈ వాగ్వివాదం తర్వాత సల్మాన్ కొందరు ఫొటోగ్రాఫర్లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బిగ్ బాస్ 20 సెట్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకున్నాడు.
Advertisement

More Telugu News