ఇంత సింపుల్‌గా ఉంటారా? యాపిల్ కొత్త సీఈఓ సోషల్‌ మీడియా ఖాతా చూసి నెటిజన్ల షాక్‌!

  • జాన్‌ టెర్నస్‌ లింక్డిన్‌ ప్రొఫైల్‌పై చర్చ
  • ఇంకా పాత వైస్‌ ప్రెసిడెంట్‌ హోదానే కనిపిస్తున్న వైనం
  • ప్రొఫైల్‌లో కెరీర్‌ వివరాలూ పరిమితంగానే
  • విజయాలను చూపించే ప్రత్యేక విభాగాలు లేవు
  • పర్సనల్‌ బ్రాండింగ్‌పై నెటిజన్లలో చర్చ
ప్రపంచంలోని దిగ్గజ టెక్‌ కంపెనీకి అధిపతి అంటే.. ఆయన సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ కూడా అదే స్థాయిలో హంగులతో ఉంటుందని అనుకుంటాం కదా! హోదా, ఘనతలు, సాధించిన విజయాలు.. ఇలా ఎన్నో వివరాలు కనిపిస్తాయని ఊహిస్తాం. కానీ, యాపిల్‌ కొత్త సీఈఓ జాన్‌ టెర్నస్‌ లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. సీఈవోగా బాధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్నా.. ప్రొఫైల్‌లో ఇంకా పాత హోదానే కనిపిస్తోంది. పైగా తన గురించి చెప్పుకునే వివరాలు కూడా చాలా తక్కువ. దీంతో టెర్నస్‌ ప్రొఫైల్‌ ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

జాన్‌ టెర్నస్‌ సెప్టెంబర్‌ 1న యాపిల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. టిమ్‌ కుక్‌ స్థానంలో ఆయన పగ్గాలు అందుకున్నారు. 25 ఏళ్లకు పైగా యాపిల్‌లో పనిచేసిన టెర్నస్‌.. కంపెనీలో కీలక హోదాల్లో కొనసాగారు. అయినా ఆయన లింక్డ్‌ఇన్‌ ఖాతా మాత్రం ఇంకా పాత హోదానే చూపిస్తోంది. 

ప్రొఫైల్‌లో యాపిల్‌లో పనిచేస్తున్నట్లు ఉంది. అయితే సీఈవోగా కొత్త హోదాను ఇంకా చేర్చలేదు. గతంలో వర్చువల్‌ రీసెర్చ్‌ సంస్థలో ఇంజినీర్‌గా నాలుగేళ్లు పనిచేసిన విషయాన్ని కూడా పేర్కొన్నారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివినట్లు వివరించారు.

యాపిల్‌లో టెర్నస్‌ పాత్ర మాత్రం చాలా కీలకం. ఐప్యాడ్‌, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఐఫోన్‌, మ్యాక్‌, యాపిల్‌ వాచ్‌ ఉత్పత్తుల అభివృద్ధిలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2001లో యాపిల్‌లో చేరిన ఆయన 2013లో హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. 2021లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌లో చేరారు. 

సాధారణంగా లింక్డిన్‌లో ఆకర్షణీయమైన ఫొటో, ప్రత్యేకమైన హెడ్‌లైన్‌, ‘అబౌట్‌’ సెక్షన్‌, విజయాలను చూపించే ‘ఫీచర్డ్‌’ విభాగం ఉండాలని పర్సనల్‌ బ్రాండింగ్‌ నిపుణులు చెబుతుంటారు. టెర్నస్‌ ప్రొఫైల్‌లో ఇవేవీ పెద్దగా లేకపోవడాన్ని ఓ యూజర్‌ ప్రస్తావించారు.

‘చేసిన పని కంటే బలమైన పర్సనల్‌ బ్రాండ్‌ మరొకటి ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరో యూజర్‌ మాత్రం ఆసక్తికరమైన అభిప్రాయం చెప్పారు. టెర్నస్‌కు ‘యాపిల్‌ సీఈవో’ అనే హోదానే భారీ గుర్తింపును తెచ్చిందన్నారు. ఆ హోదా లేని వారికి మాత్రమే తమ పని బయటకు కనిపించేలా లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Advertisement

More Telugu News