రిఫరల్ ఉంటే జాబ్ పక్కా.. 8.5 రెట్లు ఎక్కువ ఛాన్స్: లింక్డ్‌ఇన్ సంచలన నివేదిక

LinkedIn sensational report says job referrals increase hiring chances by 85 times
  • భారత్‌లో రిఫరల్ ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం 8.5 రెట్లు ఎక్కువ
  • నెట్‌వర్కింగ్ చేయడానికి జంకుతున్న 83 శాతం భారతీయ జెన్-జీ యువత
  • ఎలా నెట్‌వర్క్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న సగానికి పైగా నిపుణులు
  • జడ్జ్ చేస్తారనే భయమే నెట్‌వర్కింగ్‌కు ప్రధాన అడ్డంకి అని వెల్లడి
  • ఏఐ యుగంలోనూ ఉద్యోగాలకు ప్రొఫెషనల్ సంబంధాలే కీలకమన్న నివేదిక
భారతదేశంలో ఉద్యోగానికి ప్రయత్నించేవారికి, వారు అప్లై చేస్తున్న కంపెనీలో ముందే తెలిసిన వారు (ఇన్‌సైడ్ కనెక్షన్) ఉంటే, ఉద్యోగం పొందే అవకాశాలు దాదాపు 8.5 రెట్లు పెరుగుతాయని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. కేవలం అర్హతలు, నైపుణ్యాలకే కాకుండా, ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్స్, రిఫరల్స్ ఉద్యోగ వేటలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

ఈ నివేదిక ముఖ్యంగా యువత (జెన్-జీ) నెట్‌వర్కింగ్ విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేసింది. భారతదేశంలోని 83 శాతం మంది జెన్-జీ నిపుణులు కొత్తవారితో ప్రొఫెషనల్ సంబంధాలు ఏర్పరచుకోవడానికి సంకోచిస్తున్నారని తేలింది. వృత్తిపరమైన ఎదుగుదలకు నెట్‌వర్కింగ్ అవసరమని 79 శాతం మంది భావిస్తున్నప్పటికీ, వారిలో 52 శాతంం మందికి ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. అలాగే, 53 శాతం మంది తమ కాంటాక్ట్‌లను అర్థవంతమైన సంబంధాలుగా మార్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. తమకు నెట్‌వర్కింగ్ ఎలా చేయాలో ఎవరూ నేర్పలేదని 59 శాతం మంది చెప్పడం గమనార్హం.

నెట్‌వర్కింగ్ చేయడానికి వెనుకాడటానికి ప్రధాన కారణాలను కూడా సర్వేలో గుర్తించారు. ఇతరులు తమను జడ్జ్ చేస్తారేమోనన్న భయం (44 శాతం), అవతలి వారిని ఇబ్బంది పెడుతున్నామనే భావన (39 శాతం), తమ పరిచయం కృత్రిమంగా అనిపిస్తుందేమోననే ఆందోళన (37 శాతం) వంటివి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. ఈ భయాలను అధిగమించడానికి, ఒకేరకమైన ఆసక్తులు ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవడం, కనెక్షన్ రిక్వెస్ట్ పంపే ముందు వారి పోస్టులతో ఎంగేజ్ అవడం, అవసరం పడకముందే సంబంధాలను నిర్మించుకోవడం వంటివి మేలు చేస్తాయని లింక్డ్‌ఇన్ సూచించింది.

మొత్తం మీద, ఏఐ సాంకేతికత విస్తరిస్తున్న ఈ రోజుల్లోనూ మానవ సంబంధాలు, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ఉద్యోగ మార్కెట్‌లో కీలకమని ఈ నివేదిక తేల్చిచెప్పింది. కాగా, సెన్సస్‌వైడ్ అనే సంస్థ జూలై-ఆగస్టు 2026 మధ్య భారత్‌తో సహా 12 దేశాల్లో 18,050 మంది నిపుణులపై ఈ సర్వే నిర్వహించింది.
Advertisement
LinkedIn
Job Referrals
Career Networking
Gen Z Professionals
India Job Market
Professional Relationships

More Telugu News