టాటా కెమికల్స్‌కు కెన్యా అధ్యక్షుడి షాక్‌.. 100 ఏళ్ల తర్వాత కీలక ఆదేశం!

Tata Chemicals Kenya President shock key order after 100 years
  • టాటా కెమికల్స్‌ కార్యకలాపాలు ఆపాలని రూటో ఆదేశం
  • వందేళ్లుగా ఉన్న సంస్థపై కెన్యా అధ్యక్షుడి అసంతృప్తి
  • స్థానిక పెట్టుబడులు, ఉద్యోగాలు లేవని రూటో ఆరోపణ
  • టాటా స్థానంలో కొత్త పెట్టుబడిదారులను తెస్తామన్న రూటో
  • ‘మగాడి’లో 1911లో ప్రారంభమైన టాటా కార్యకలాపాలు
కెన్యాలో టాటా కెమికల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘లేక్‌ మగాడి’లో కార్యకలాపాలు నిలిపివేయాలని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించారు. వందేళ్లకు పైగా అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నా.. స్థానికంగా తగిన పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకురాలేదని ఆయన ఆరోపించారు.

కజియాడో ప్రాంతంలో గురువారం జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో రూటో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లేక్‌ మగాడి’ వనరులతో స్థానిక ప్రజలకు ప్రయోజనం కలగాలని అన్నారు. టాటా కెమికల్స్ స్థానంలో కొత్త పెట్టుబడిదారులను తీసుకొస్తామని చెప్పారు. కజియాడోలోనే గాజు పరిశ్రమ, రసాయనాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

కెన్యా సహజ వనరులను వెలికితీసి ఇతర దేశాలకు పంపించడం కాకుండా.. దేశంలోనే వాటిని ప్రాసెస్‌ చేయాలని రూటో అన్నారు. అలా చేస్తే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమలు వస్తాయని, పన్నుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వనరులు ఉన్న ప్రాంత ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం దక్కాలని స్పష్టం చేశారు.

అయితే రూటో నిర్ణయంపై ప్రతిపక్ష డెమోక్రసీ ఫర్‌ ది సిటిజన్స్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ చర్య వెనుక అధ్యక్షుడి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించింది. మగాడి ప్రాంతంలో భారీ లిథియం నిల్వలు ఉన్నాయని, చమురు అన్వేషణకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. టాటా కెమికల్స్‌ను తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఈ నిర్ణయం వల్ల లక్ష మందికి పైగా ప్రజల జీవనోపాధిపై ప్రభావం పడొచ్చని హెచ్చరించింది.

జులైలోనే ‘మగాడి’ సోడా ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేయాలని కెన్యా ప్రభుత్వం ఆదేశించింది. సోడా యాష్‌ ఎగుమతులను కూడా ఆపేసింది. ‘లేక్‌ మగాడి’లో టాటా కెమికల్స్‌ కార్యకలాపాలు 1911లో ప్రారంభమయ్యాయి. 2005లో టాటా కెమికల్స్‌ సంస్థను సొంతం చేసుకుంది. అక్కడ ట్రోనా నుంచి సోడా యాష్‌ తయారు చేస్తోంది. గాజు, డిటర్జెంట్లు, రసాయనాలు, నీటి శుద్ధిలో దీనిని ఉపయోగిస్తారు.
Advertisement
Tata Chemicals
William Ruto
Lake Magadi
Kenya
Soda Ash
Kajiado

More Telugu News