సూర్య మానసిక పోరాటాలు చూశాను: సక్సెస్ మీట్‌లో నటి రాధికా శరత్‌కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు

Suriya Viswanathan and Sons success meet Radikaa Sarathkumar emotional speech
  • సూర్య బాధలు, కష్టాలు అత్యంత దగ్గర నుంచి చూశానన్న రాధిక
  • వాటిని అధిగమించిన సూర్యను చూస్తుంటే తనకు గర్వంగా ఉందని వ్యాఖ్య
  • సూర్యను తన సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తానన్న రాధిక

తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్‌ అండ్ సన్స్‌’ చిత్రంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో సూర్యకు తల్లిగా నటించిన సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ పాల్గొని, ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


ఈ కథను సూర్య అంగీకరించారని తెలిసి తాను ఆశ్చర్యపోయానని రాధిక అన్నారు. సూర్య ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, మానసిక పోరాటాలను తాను అత్యంత దగ్గర నుండి చూశానని తెలిపారు. సినిమాల్లో సవాళ్లు సాధారణమే అయినప్పటికీ, మానసిక పోరాటాలు వేరే స్థాయిలో ఉంటాయని, వాటిని అధిగమించిన సూర్యను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.


సూర్యను తన సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తానని రాధిక పేర్కొన్నారు. సూర్య ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదని, మనసులోని భావాలను చాలా అరుదుగా కొందరితో మాత్రమే పంచుకుంటారని తెలిపారు. అలా సూర్య మనసు విప్పి మాట్లాడే ఆ కొద్దిమంది సన్నిహితుల్లో తాను ఒకరినని, ఆయనకు అప్పుడప్పుడు సలహాలు కూడా ఇస్తుంటానని వెల్లడించారు.


ఇటీవల జరిగిన మరొక కార్యక్రమంలో సూర్య కూడా రాధికతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన సోదరుడు కార్తి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే క్రమంలో రాధిక ఆర్థిక సహాయం చేశారని, ఆ మేలును తమ కుటుంబం జీవితాంతం గుర్తుపెట్టుకుంటుందని సూర్య కృతజ్ఞతలు తెలిపారు.


వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది.

Advertisement
Suriya
Radikaa Sarathkumar
Viswanathan and Sons
Venky Atluri
Karthi
Tamil Cinema Success Meet

More Telugu News