రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ.. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్
- 22ఏ పేరుతో రెవెన్యూ శాఖలో దందాలు, వేధింపులు సాగుతున్నాయన్న హరీశ్
- ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపాటు
- రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ల రాకెట్ నడుస్తోందని ఆరోపణ
తెలంగాణలోని రెవెన్యూ శాఖలో నిషేధిత భూముల (22Aఏ) పేరుతో బహిరంగంగా దందాలు, వేధింపులు సాగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన బహిరంగ లేఖ రాశారు. ఈ అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
చట్టప్రకారం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు అడ్డుకోవాల్సిన 22ఏ నిబంధనను, ప్రైవేట్ ఆస్తులపై కావాలనే కృత్రిమ వివాదాలు సృష్టించి డబ్బులు గుంజడానికి వాడుకుంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి ప్రారంభించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ (HMDA) అనుమతులు ఉన్న వేలాది ప్లాట్లు, నివాసాలను ఏకపక్షంగా నిషేధిత జాబితాలో చేర్చి సామాన్యులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితమే క్రమబద్ధీకరించిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూములను, క్లియర్ రిజిస్టర్డ్ పత్రాలు ఉన్న ఆస్తులను మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చడం తీవ్ర దుర్మార్గమని విమర్శించారు.
రెవెన్యూ శాఖలో ఏకంగా 30 శాతం కమీషన్ల రాకెట్ నడుస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఒకసారి 22ఏ జాబితాలో పెట్టిన భూములను మళ్లీ తొలగించాలంటే మార్కెట్ విలువలో 30 శాతం కమీషన్లు ఇవ్వాలని దళారులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకించి ఓఆర్‌ఆర్ పరిసరాల్లో ఉన్న అత్యంత విలువైన భూములను బ్లాక్ చేసి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లకు ఒప్పుకోవాలని యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను ఈ జాబితాలో పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా బయటపెట్టినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 22ఏ జాబితాలో కొత్తగా చేర్చిన, అలాగే తొలగించిన ప్రతి భూమి వివరాలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరారు. జిల్లాల వారీగా ఈ నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి పారదర్శకత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఒక అవినీతి మంత్రిని కాపాడేందుకు ప్రజల నమ్మకాన్ని పణంగా పెడుతున్నారని, రాహుల్ గాంధీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.