4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష విధించిన జడ్జి రవికుమార్.. 100కు పైగా హత్య కేసులు వేరే కోర్టుకు బదిలీ
- ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా ఉన్న రవికుమార్
- మరణశిక్ష పడే కేసులు ఆయన వద్దకు వస్తే ఉరిశిక్ష విధిస్తారంటూ భయాందోళనలు
- వారణాసిలోని గ్యాన్‌వాపి కాంప్లెక్స్ వీడియో సర్వేకి ఆదేశించి పాప్య్యులర్ అయిన రవికుమార్
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 10 వేర్వేరు కేసుల్లో ఏకంగా 22 మంది నిందితులకు ఉరిశిక్ష (మరణశిక్ష) విధిస్తూ ఆయన సంచలన తీర్పులు ఇవ్వడమే ఈ భారీ కేటాయింపుల బదిలీకి ప్రధాన కారణమైంది.
మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు జడ్జి రవికుమార్ దివాకర్ వద్దకు వస్తే, ఆయన ఉరిశిక్షలు విధించే అవకాశం ఉందన్న భయాందోళనలు న్యాయవాదులు, వాది ప్రతివాదుల్లో వ్యక్తమయ్యాయని జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రమోద్ త్యాగి తెలిపారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే 100కు పైగా హత్య కేసులను వేరే కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.
జడ్జి రవికుమార్ దివాకర్ గత ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో పలు పాత కేసులను 'అరుదైన వాటిలో అరుదైనది' (Rarest of rare cases) గా పేర్కొంటూ కఠిన తీర్పులు ఇచ్చారు.
జడ్జి రవికుమార్ మరణశిక్ష విధించిన కొన్ని కేసుల వివరాలు:
ఆగస్టు 13: 12 ఏళ్ల నాటి హత్య కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ఆగస్టు 12: 27 ఏళ్ల క్రితం (1999) కిడ్నాప్ చేసి వ్యాపారిని దారుణంగా చంపిన నిందితుడికి మరణశిక్ష విధించారు.
జూలై 17 & 06: 2011 నాటి రైతు హత్య కేసులో నలుగురికి, 2010 నాటి మాజీ సర్పంచ్ హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష విధించారు.
మే - ఏప్రిల్: 15 ఏళ్ల నాటి తల్లి, కుమారుడి జంట హత్యల కేసులో ఒకరికి, 2019 నాటి న్యాయవాది కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించారు.