Advertisement

సోనీ పిక్చర్స్‌తో భారీ డీల్... 'రామాయణ' ట్రైలర్ విడుదల వాయిదా

Ramayana trailer release postponed after massive deal with Sony Pictures
  • గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కోసం సోనీ పిక్చర్స్‌తో ఒప్పందం
  • నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ప్రకటన
  • ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ట్రైలర్ లాంచ్ చేసే ప్లాన్
నితీశ్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'రామాయణం' చిత్రం ట్రైలర్ విడుదల వాయిదా పడింది. అంతర్జాతీయ పంపిణీ హక్కుల నిమిత్తం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈ పరిణామంతో శుక్రవారం ఉదయం విడుదల కావాల్సిన ట్రైలర్ నిలిచిపోయింది.

భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వద్దకు చేర్చాలన్న తన కల ఈ భాగస్వామ్యంతో సాకారమవుతోందని నమిత్ మల్హోత్రా సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇదొక విశేషమైన సందర్భమని, అందుకే ట్రైలర్‌ను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో విడుదల చేస్తామని ఆయన వివరించారు. అయితే, కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు.

ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తుండగా, సన్నీ డియోల్, రవి దూబే కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుండగా, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఒప్పందం ప్రకారం, సోనీ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ బాధ్యతలు చేపట్టగా, దేశీయ మార్కెట్‌లో ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Advertisement
Ramayana Movie
Ranbir Kapoor
Sony Pictures
Ramayana Trailer Postponed
Sai Pallavi
Nitesh Tiwari

More Telugu News