Advertisement

ఎస్వీబీసీ ప్రసారాలపై టీటీడీ ఈవో సమీక్ష.. నాణ్యత, సృజనాత్మకతకు పెద్దపీట

TTD EO reviews SVBC broadcasts priority for quality and creativity
  • ఎస్వీబీసీ ప్రసారాలు మరింత సృజనాత్మకంగా ఉండాలన్న టీటీడీ ఈవో
  • తిరుమల క్షేత్ర వైభవంపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సూచన
  • కార్యక్రమాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం
  • గ్రామస్థాయికి 'మహాలక్ష్మీ దీపపూజ' కార్యక్రమం విస్తరణ
  • బ్రహ్మోత్సవాలకు ప్రముఖ కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో భక్తి భావాన్ని మరింత ఇనుమడింపజేసేలా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలు ఉన్నత ప్రమాణాలతో, సృజనాత్మకంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో జేఈవో డాక్టర్ ఎ. శరత్‌తో కలిసి ఛానల్ కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల క్షేత్రంలోని మండపాలు, తీర్థాలు, ఉపాలయాలు, శ్రీవారి ప్రసాదాల విశిష్టత వంటి అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతి భక్తుడి హృదయానికి హత్తుకునేలా ఆకర్షణీయమైన రీతిలో కార్యక్రమాలు ఉండాలన్నారు. లక్షలాది మంది వీక్షించే ఎస్వీబీసీలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భక్తి, భావం, సరళత కలగలిపిన సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకాదరణ పెంచాలని దిశానిర్దేశం చేశారు.

అనంతరం ఎస్వీబీసీ సీఈవో, టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ.. హెచ్‌డీపీపీ సహకారంతో ప్రారంభించిన 'మహాలక్ష్మీ దీపపూజ' కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, దీనిని త్వరలో గ్రామ స్థాయికి విస్తరించనున్నట్లు ఈవోకు వివరించారు. రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖ కళాకారులతో ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సమీక్షకు ముందు ఈవో రవిచంద్ర ఎస్వీబీసీలోని పలు స్టూడియోలు, ఎడిటింగ్ విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలని హితవు పలికారు. అనంతరం అక్కడి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 

Advertisement
Muddada Ravichandra
TTD EO
SVBC Channel
Tirumala Tirupati Devasthanams
Sri Venkateswara Bhakti Channel
Tirupati News

More Telugu News