నీట్ పేపర్ లీకేజ్.. కీలక సూత్రధారి అరెస్ట్
- పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్న సీబీఐ
- కోచింగ్ క్లాసుల పేరుతో విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు ఆరోపణలు
- ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి డొమైన్ నిపుణుడిగా పనిచేసిన కులకర్ణి, తన హోదాను దుర్వినియోగం చేశారని సీబీఐ వర్గాలు తెలిపాయి. పుణెలోని తన నివాసంలో ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించి, విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని కెమిస్ట్రీ ప్రశ్నపత్రాన్ని వారికి ముందుగానే చెప్పేశారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులను సమీకరించడంలో కులకర్ణికి సహకరించిన మనీషా అనే మహిళను సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరింది.
పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షను మే 12న ఎన్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా సీబీఐ దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది.
ఇదిలా ఉండగా, రద్దయిన నీట్-యూజీ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 14న విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.