మార్కెట్లకు యుద్దం సెగ... కుప్పకూలిన సూచీలు
- 1470 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 488 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, మెటల్ షేర్లు భారీగా పతనం
- డాలర్‌తో పోలిస్తే సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి
గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని, ఇంధన ధరలు పెరగొచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందడంతో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మార్కెట్లలో అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఇండెక్స్ 5.23 శాతం పెరిగి 22.65 స్థాయికి చేరింది. బెంచ్‌మార్క్ సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.62 శాతం, స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.52 శాతం మేర పతనమయ్యాయి.
రంగాలవారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 5 శాతం నష్టపోయింది. పీఎస్‌యూ బ్యాంక్, మీడియా సూచీలు కూడా భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనిలీవర్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వరుసగా రెండో వారం కూడా బలహీనపడి, సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయికి చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడమే ఈ పతనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీకి 23,100 వద్ద తక్షణ మద్దతు ఉందని, 23,450-23,500 స్థాయి నిరోధకంగా పనిచేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.