అట్టారీ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి... సైనికులకు ఘన నివాళి
- అట్టారీ సరిహద్దులో తొలిసారి ప్రదర్శన ఇచ్చిన ఏఆర్ రెహమాన్
- దేశ సైనికులకు నివాళిగా 'జై హో' పేరుతో సంగీత కార్యక్రమం
- ఇంతియాజ్ అలీ కొత్త చిత్రం 'మై వాపస్ ఆవూంగా' ప్రమోషన్‌లో భాగంగా ఈవెంట్
- దేశ విభజన నేపథ్యంలో సాగే ప్రేమకథగా సినిమా
- కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు ఇంతియాజ్ అలీ, నటుడు వేదాంగ్ రైనా
ఈ సందర్భంగా దర్శకుడు ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. "ఈ ప్రదర్శన మన జాతీయ స్ఫూర్తికి, సరిహద్దుల్లో దేశ రక్షణలో ఉన్న బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సైనికులకు ఒక నివాళి. మనందరినీ కలిపి ఉంచే ప్రేమ, ఐక్యతకు ఇది ప్రతీక" అని అన్నారు. తన కొత్త చిత్రం 'మై వాపస్ ఆవూంగా' గురించి ప్రస్తావిస్తూ... "1947 దేశ విభజన సమయంలో సరిహద్దులు ఏర్పడిన నాటి కథతో ఈ సినిమా వస్తోంది. ఆ సమయంలో ఇళ్లు, ప్రాణాలే కాదు, ఎన్నో హృదయాలు కూడా ముక్కలయ్యాయి. మేము ప్రేమ సందేశాన్ని అందిస్తున్నాం. ఎందుకంటే అంతిమంగా ప్రేమ మాత్రమే మనల్ని నిలబెడుతుంది" అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ సంగీత సాయంత్రం రెహమాన్ అద్భుత గాత్రంతో ఆలపించిన 'చందా సూరజ్ లాఖోం తారే' పాటతో ప్రారంభమైంది. ఆ తర్వాత 'మై వాపస్ ఆవూంగా' చిత్రంలోని గీతాలను గాయకులు మోహిత్ చౌహాన్, నీలాంజనా ఘోష్, పూజా తివారీ, నర్గీస్, నటుడు వేదాంగ్ రైనాలు ఆలపించారు. రెహమాన్ పాడిన ఐకానిక్ దేశభక్తి గీతం 'మా తుఝే సలాం'తో ఈ సంగీత విభావరి భావోద్వేగంగా ముగిసింది.
'మై వాపస్ ఆవూంగా' సినిమా విషయానికొస్తే, ఇంతియాజ్ అలీ మార్క్ ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. దేశ విభజన కారణంగా విడిపోయిన వారి ప్రేమకథగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శర్వరీ వాఘ్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. ఇర్షాద్ కమిల్ సాహిత్యం సమకూర్చారు. బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, విండో సీట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.