పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
- శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్
- పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు
- ధర్మవరం బత్తలపల్లిలో లోకేష్‌కు బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు
- కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి
- ఆర్డీటీ ఆసుపత్రి సందర్శన, అనంతపురం నేతలతో సమన్వయ సమావేశం
తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతిఒక్కరినీ మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉత్సాహంగా ఫోటోలు దిగారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు ఆయనకు తమ సమస్యలు, స్థానిక పరిస్థితులను వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. వారి నుంచి వినతులను స్వీకరించిన లోకేష్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి లోకేష్ ధర్మవరం నియోజకవర్గానికి బయలుదేరారు. మార్గమధ్యంలో బత్తలపల్లి సెంటర్‌లో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసందోహం మధ్య లోకేష్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఈ పర్యటనలో భాగంగా, మంత్రి లోకేష్ బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఆ తర్వాత అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.