హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు
- జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
- మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాల ఖరారు
- లబ్ధిదారుల నివాస ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు
- హైదరాబాద్‌లో సొంత స్థలం ఉన్నవారికి మే చివరికల్లా మంజూరు పత్రాలు
మంగళవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల హౌసింగ్, రెవెన్యూ అంశాలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులతో పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సొంత స్థలం ఉండి, అర్హులైన లబ్ధిదారులకు మే నెలాఖరులోగా ఇంటి మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు.
గత ప్రభుత్వం హైదరాబాద్‌కు 20-30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిందని, దీనివల్ల పేదలకు ప్రయోజనం చేకూరలేదని మంత్రి విమర్శించారు. ఈసారి అలా కాకుండా, లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు నిర్మించుకునేలా స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ భూములు అంగుళం అన్యాక్రాంతమైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో మల్కాజ్‌గిరిలోని యూఎల్సీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల అంశం ప్రస్తావనకు రాగా, బాధ్యులైన రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.