2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు
- తిరుమల నిత్యాన్నదాన పథకానికి 39 వసంతాలు పూర్తి
- 2 వేల మందితో మొదలై నేడు 2.80 లక్షల మందికి అన్నప్రసాదం
- రూ.2,500 కోట్లు దాటిన శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ నిధులు
- దాతల సహకారం మరువలేనిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- టీటీడీ పరిధిలోని 60 ఆలయాలకు పథకం విస్తరణ
ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల భాగస్వామ్యం, దాతల సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి రూ.2,500 కోట్లు దాటిందని తెలిపారు. ఈ పథకం స్ఫూర్తితోనే ప్రాణదానం, విద్యాదానం వంటి ట్రస్టులను ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా రంగాల్లో సేవలు అందిస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు జరిగిన ప్రగతిని వివరిస్తూ చంద్రబాబు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ మహోన్నత కార్యక్రమానికి చేయూతనిస్తున్న దాతలకు ఆయన అభినందనలు, నమస్కారాలు తెలియజేశారు.


