ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
- ఏప్రిల్ రెండో వారంలో ఫలితాల వెల్లడికి సన్నాహాలు
- చేతిరాత బాగోలేదని మార్కులు తగ్గించవద్దని స్పష్టమైన ఆదేశం
- మూల్యాంకనంలో పొరపాట్లు చేస్తే భారీ జరిమానాలు, డీబార్
- రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంజిత్ బాషా వివరించారు. ఇప్పటికే ప్రధాన పరీక్షలు మార్చి 18తో ముగిశాయని గుర్తుచేశారు. మూల్యాంకనంలో భాగంగా ఒక్కో లెక్చరర్ ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున జవాబు పత్రాలను దిద్దనున్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యా శాఖ ఇప్పటికే జూనియర్ లెక్చరర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ముఖ్యంగా, విద్యార్థి చేతిరాత బాగాలేదన్న కారణంతో మార్కులు తగ్గించవద్దని ఈ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. జవాబులో ఉన్న సమాధానాన్ని పూర్తిగా చదివి, దాని ఆధారంగానే మార్కులు వేయాలని సూచించింది. మూల్యాంకనం పూర్తయ్యాక, మార్కులను తిరిగి పరిశీలించి స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించింది.
ఈసారి మూల్యాంకనంలో తప్పులు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని బోర్డు హెచ్చరించింది. పొరపాట్లు చేసిన వారికి రూ.3,000 నుంచి రూ.7,500 వరకు, వాటిని పరిశీలించిన వారికి రూ.2,000 నుంచి రూ.3,750 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. మార్కుల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తే, సంబంధిత లెక్చరర్లను మూల్యాంకనం నుంచి డీబార్ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కలిపి మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.