గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ పర్యటన
- గిరిజనుల మధ్య జనసేన 13వ ఆవిర్భావ వేడుకలు
- పాడేరు నియోజకవర్గంలోని నందిగరువులో పర్యటించిన పవన్
- కేంద్ర పథకాల నిధులతో నిర్మిస్తున్న రోడ్ల పరిశీలన
- గిరిజనులతో మాటామంతీ.. వారితో కలిసి సహపంక్తి భోజనం
తొలుత ఓనూరు జంక్షన్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్, అక్కడి నుంచి కాలినడకన తన పర్యటన కొనసాగించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు సుమారు 2.4 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రహదారిపై నడుస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం 'అడవితల్లి బాట' కార్యక్రమంలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ ప్రారంభించారు. పర్యటన ముగింపులో నందిగరువు గ్రామంలో గిరిజనులతో ప్రత్యేకంగా మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యోగక్షేమాలను విచారించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా గిరిజనుల మధ్య పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.