గ్రామంలో కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేసిన కొత్త సర్పంచ్
- ఎలుగుబంటి వేషం వేసిన కడెం మండలం లింగాపూర్ సర్పంచ్ రంజిత్ కుమార్
- ఆ వేషం చూసి అక్కడి నుంచి పరుగెత్తిన కోతులు
- యూట్యూబ్‌లో చూసి ఈ ఆలోచన వచ్చిందని వెల్లడి
జిల్లాలోని కడెం మండలం లింగాపూర్‌లో బీఆర్ఎస్ బలపరిచిన కుమ్మరి రంజిత్ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తరువాత గ్రామం నుంచి కోతులను తరిమి కొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేశాడు. ఆ వేషం చూసి కోతులు అక్కడి నుంచి పారిపోయాయి. ఇలాంటి ఎలుగుబంటి దుస్తులను మరో రెండు మూడు తెప్పించి కోతులు రాకుండా చేస్తానని రంజిత్ హామీ ఇచ్చాడు.
ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ, గత రెండు మూడేళ్లుగా తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని అన్నాడు. ఇంటింటికి కొంత మొత్తం వసూలు చేసి బోనులు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపాడు. గ్రామానికి ఈ బెడద తప్పించేందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో యూట్యూబ్‌లో చూడగా ఈ ఆలోచన వచ్చిందని అన్నాడు. ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో కోతుల బెడదను తప్పించాలని విజ్ఞప్తి చేశాడు.