పవన్ కల్యాణ్ దర్శకుడు సుజీత్ కు ఆ కారే ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
- 'ఓజీ' దర్శకుడు సుజీత్‌కు పవన్ ఖరీదైన కారు బహుమతి
- సినిమా కోసం తన ల్యాండ్ రోవర్ అమ్మేసుకున్న సుజీత్
- జపాన్ షెడ్యూల్ కోసం దర్శకుడి సొంత ఖర్చు
- విషయం తెలిసి చలించిపోయిన పవన్ కల్యాణ్
- అదే కారును కొనిచ్చిన పవర్ స్టార్
విశ్వసనీయ సమాచారం ప్రకారం, 'ఓజీ' సినిమా చివరి దశ షూటింగ్ సమయంలో జపాన్‌లో ఒక కీలకమైన షెడ్యూల్ చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా నిర్మాణ సంస్థ ఈ విదేశీ షెడ్యూల్‌కు అంగీకరించలేదు. కానీ, ఆ సన్నివేశాలు సినిమాకు ఎంతో ముఖ్యమని, అవి ఉంటేనే కథకు సంపూర్ణత వస్తుందని సుజీత్ బలంగా నమ్మాడు.
దీంతో అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు ఏకంగా తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బుతో చిత్ర యూనిట్‌ను జపాన్‌కు తీసుకెళ్లి, తాను అనుకున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. ఈ విషయం సినిమా డబ్బింగ్ పనుల సమయంలో పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. సినిమా కోసం దర్శకుడు పడిన తపన, అతడి బాధ్యత చూసి పవన్ చలించిపోయారు.
సుజీత్ అంకితభావానికి ముగ్ధుడైన పవన్, అతను ఏ కారునైతే సినిమా కోసం అమ్మాడో, అదే మోడల్ కారును మళ్లీ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కొని సుజీత్‌కు బహూకరించారు.