Alla Ramakrishna Reddy: వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
- వైఎస్సార్ హయాంలో రెండు సార్లు టికెట్ ఆశించి భంగపడ్డానన్న ఆర్కే
- అయినా వైఎస్ ను, కాంగ్రెస్ ను ఒక్క మాట కూడా అనలేదని వ్యాఖ్య
- జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరానని వెల్లడి
- ఎమ్మెల్యేగా రెండు సార్లు అవకాశం ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఆర్కే
- అన్ని విషయాలపై తర్వాత మాట్లాడతానని వ్యాఖ్య
వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు... 2019 నుంచి ఇప్పటి వరకు నీతి, నిజాయతీగా ఎమ్మెల్యేగా పని చేశానని... ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేశానని ఆయన చెప్పారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ... కఠినమైన నిర్ణయం తీసుకోవాలనిపించి రెండు నిర్ణయాలను తీసుకున్నానని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనేది ఒక నిర్ణయం కాగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలనేది రెండో నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను కూడా ఆయన మీడియాకు చూపించారు.