డబ్బుకు ఆశపడి రాఫెల్ ఫొటోలను ఐఎస్ఐకి పంపించిన యువకుడు.. అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
- ఐఎస్ఐ ఏజెంట్ గా మారి దేశంలో పేలుళ్లకు కుట్ర
- పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న ఎస్టీఎఫ్ సిబ్బంది
- యువకులను జిహాదీలుగా మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణ
మీరట్ కు చెందిన కలీమ్ అహ్మద్ డబ్బు కోసం ఐఎస్ఐ ఏజెంట్లతో చేతులు కలిపాడు. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లి వచ్చాక మారు పేరు, తప్పుడు చిరునామాతో సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ సిమ్ ద్వారా మన దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలను పాకిస్థాన్ లోని ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించాడు. యువతను రెచ్చగొట్టి జిహాదీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడి దేశంలో అశాంతిని సృష్టించేందుకు ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నాడు.
రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలను కూడా ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించాడని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. కలీమ్ వ్యవహారంపై ఓ ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందిందని, వెంటనే దాడులు చేసి కలీమ్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కలీమ్ ఇంట్లో సోదాలు జరపగా.. మారుపేరుతో తీసుకున్న సిమ్ కార్డు, అందులో పాకిస్థాన్ నెంబర్లు, ఆయుధాలతో పాటు పలు కీలక ఆధారాలు దొరికాయని వివరించారు. కలీమ్ సోదరుడు తహసీన్ అలియాస్ తసీమ్ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు.