వైసీపీని వీడుతున్నారనే వార్తలపై ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పందన
- తాను పార్టీ మారడం లేదన్న మేకపాటి విక్రమ్ రెడ్డి
- జగన్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టీకరణ
- నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా
ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని అన్నారు. జగన్ కుటుంబంతో తమ కుటుంబానికి చాలా కాలంగా అనుబంధం ఉందని... జగన్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు.
జగన్ కు మద్దతుగా తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తర్వాత జగన్ తమను పిలిచి ఆ సీటును ఇచ్చారని తెలిపారు. తనకు ఏ సాయం కావాలన్నా ముందుగా జగన్ నే సంప్రదిస్తానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు.