ఇప్పుడు తిరుపతిలో జరగని పాపం అంటూ లేదు: సినీ నిర్మాత అశ్వనీదత్
- వైసీపీ మూడేళ్ల పాలనతో తిరుపతిని సర్వనాశనం చేసిందన్న అశ్వనీదత్
- అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని వ్యాఖ్య
- చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందన్న అశ్వనీదత్
గతంలో తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారం వెయ్యికాళ్ల మండపాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించారన్నారు. కానీ ఆ విషయంలో నాడు చినజీయర్ స్వామి.. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో బలవంతపు మత మార్పిడిలు జరుగుతుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చినజీయర్ ఆ మధ్య జగన్ ను దైవాంశ సంభూతుడని పొగిడిన మాటలు వినగానే తన కడుపు మండిపోయిందని అశ్వనీదత్ తెలిపారు.
సమ్మక్క- సారక్కను చినజీయర్ దేవతలు కాదనడం తనకు బాధ కలిగించిందన్నారు. సమ్మక్క-సారక్క అంటే తెలంగాణ ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో సమ్మక్క- సారక్కను దేవతలుగా నమ్ముతారన్నారు. తాను నిర్మించిన ‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అశ్వనీదత్ ఈ వ్యాఖ్యలు చేశారు.