ఇది ట్రైలర్ మాత్రమే.. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేస్తాం: లక్ష్మణ్
- రానున్న రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయి
- తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
- కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే కొత్త భవనాలు నిర్మిస్తున్నారా?
ఈరోజు నలుగురు నేతలు బీజేపీలో చేరడం కేవలం ట్రైలర్ మాత్రమేనని... రానున్న రోజుల్లో చేరికలు భారీగా ఉంటాయని లక్ష్మణ్ తెలిపారు. త్వరలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదగడాన్ని టీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని... అందుకే తమ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతోందని మండిపడ్డారు. డోకూరులో బీజేపీ ఎంపీటీసీ గెలిస్తే అక్కడ ప్రేమ్ కుమార్ ను హత్య చేశారని... మహబూబ్ నగర్ లో వరలక్ష్మి అనే బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాడులు, వేధింపులు పరిపాటిగా మారిపోయాయని లక్ష్మణ్ అన్నారు. సెక్రటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తే రాజాసింగ్ ను, తమ ఎమ్మెల్సీ రామచందర్ రావును అరెస్ట్ చేశారని మండిపడ్డారు.