ఆహార ప్యాకెట్లపై ఉండే 14 అంకెల FSSAI నంబర్ గురించి మీకు తెలుసా?.. దాని పూర్తి వివరాలు ఇవే!
Add ap7am to your home Screen

ఆహార ప్యాకెట్లపై ఉండే 14 అంకెల FSSAI నంబర్ గురించి మీకు తెలుసా?.. దాని పూర్తి వివరాలు ఇవే!

FSSAI 14 digit number on food packets details and importance
  • ఆహార ప్యాకెట్లపై ఉండే 14 అంకెల నంబర్‌తో కంపెనీ ప్రామాణికతను తెలుసుకోవచ్చు
  • ఈ నంబర్‌లోని ప్రతి అంకెకు ఒక ప్రత్యేక అర్థం, సమాచారం 
  • 'FoSCoS' పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో లైసెన్స్ వివరాలు సులభంగా చెక్ చేయవచ్చు
  • లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఉత్పత్తిలో పోషకాల నాణ్యతకు గ్యారెంటీ కాదు
మనం రోజూ సూపర్ మార్కెట్ లేదా కిరాణా దుకాణాల్లో కొనుగోలు చేసే పాలు, బిస్కెట్లు, నూనె వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగోతో పాటు ఓ 14 అంకెల నంబర్ ఉండటాన్ని చాలామంది గమనించే ఉంటారు. అయితే, ఆ నంబర్ ఎందుకు ఉంటుందో? దాని ప్రాముఖ్యత ఏమిటో? చాలా మందికి తెలియదు. 

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం.. ఈ నంబర్ వినియోగదారులకు ఎంతో కీలకం. మనం కొంటున్న ఆహారాన్ని విక్రయిస్తున్న సంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది.

14 అంకెల నంబర్‌లోని రహస్యం
ప్రతి ఆహార వ్యాపార సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కేటాయించే ఈ 14 అంకెల లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌లో పూర్తి సమాచారం దాగి ఉంటుంది. ఈ నంబర్‌లోని అంకెల నిర్మాణం, వాటి అర్థాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టంగా నిర్వచించింది.

మొదటి అంకె: ఇది సదరు సంస్థ పొందిన అనుమతి రకాన్ని సూచిస్తుంది. '1' అంకె ఉంటే అది పూర్తిస్థాయి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అని, '2' ఉంటే అది చిన్న వ్యాపారులకు ఇచ్చే రిజిస్ట్రేషన్ అని అర్థం.
2, 3 అంకెలు: ఇవి వ్యాపారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో రిజిస్టర్ అయిందో తెలిపే స్టేట్ కోడ్‌ను సూచిస్తాయి.
4, 5 అంకెలు: లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ జారీ చేసిన సంవత్సరాన్ని ఈ అంకెలు తెలియజేస్తాయి.
6, 7, 8 అంకెలు: లైసెన్స్ జారీ చేసిన సంబంధిత అధికారి లేదా అథారిటీ కోడ్‌ను ఈ మూడు అంకెలు సూచిస్తాయి.
చివరి ఆరు అంకెలు (9 నుంచి 14): ఇవి ఆ సంస్థకు ప్రత్యేకంగా కేటాయించిన లైసెన్సీ లేదా రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్.

ఆన్‌లైన్‌లో వెరిఫై చేయడం ఎలా?
వినియోగదారులు తమకు నచ్చిన ఆహార ఉత్పత్తిపై ఉన్న 14 అంకెల ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ వివ‌రాల సులభంగా ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. దీనికోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారిక పోర్టల్ అయిన foscos.fssai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ హోమ్ పేజీలో కనిపించే 'FBO Search' ఆప్షన్‌ను ఎంచుకుని, ప్యాకెట్‌పై ఉన్న 14 అంకెల నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆ నంబర్ సరైనదైతే, సదరు కంపెనీ పేరు, చిరునామా, లైసెన్స్ రకం, దాని గడువు తేదీ, ఆ సంస్థ తయారుచేస్తున్న ఉత్పత్తుల జాబితా వంటి వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ నంబర్ నకిలీది లేదా చెల్లనిది అయితే, ఎలాంటి రికార్డులు కనిపించవు.

ఒక ముఖ్య గమనిక
ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం.. ప్యాకెట్‌పై బ్రాండ్ యజమాని లోగో, లైసెన్స్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొన్నిసార్లు తయారీదారు, ప్యాకర్ లేదా దిగుమతిదారు వేర్వేరుగా ఉంటే, వారి లైసెన్స్ నంబర్లను కూడా ముద్రించాల్సి ఉంటుంది. అయితే, ఒక సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉన్నంత మాత్రాన, ఆ ఉత్పత్తిలో పోషకాల నాణ్యతకు అది గ్యారెంటీ కాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేస్తోంది. 

ఈ నంబర్ కేవలం ఆ సంస్థ 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006' ప్రకారం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి పనిచేస్తోందని మాత్రమే నిర్ధారిస్తుంది. కాబట్టి, వినియోగదారులు ఆహార ఉత్పత్తులు కొనేటప్పుడు ఈ నంబర్‌ను గమనించి, అవసరమైతే ఒకసారి తనిఖీ చేసుకోవడం ద్వారా నాణ్యమైన, సురక్షితమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి వీలవుతుంది.
Advertisement
FSSAI
14 digit FSSAI number
Food safety license India
FSSAI registration details
Check FSSAI number online
Food packaging safety standards

More Telugu News