ఇప్పటికీ ఫిట్.. బరువు తగ్గకుండానే బలం పెంచిన భువనేశ్వర్ కుమార్!
Add ap7am to your home Screen

ఇప్పటికీ ఫిట్.. బరువు తగ్గకుండానే బలం పెంచిన భువనేశ్వర్ కుమార్!

Bhuvneshwar Kumar Still Fit Increased Strength Without Losing Weight
  • 20% నుంచి 13-14%కి తగ్గిన బాడీ ఫ్యాట్
  • దాదాపు 74 కిలోల బరువుతోనే బలం, ఫిట్‌నెస్ సాధించిన భువీ
  • స్క్వాట్స్‌లో 40 కిలోల నుంచి 120 కిలోల బరువులు ఎత్తే స్థాయికి
  • ఐపీఎల్ 2026లో 28 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా పేసర్
  • గాయాలను అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణా ప్రణాళిక
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచడం తెలిసిందే. 36 ఏళ్ల వయసులోనూ స్థిరంగా 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడమే కాకుండా, ఏకంగా 28 వికెట్లు పడగొట్టి ఓ భారత బౌలర్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. వయసు పైబడటంతో కెరీర్ ముగిసిపోయిందనుకున్న దశలో.. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ రేంజ్ పునరాగమనం వెనుక అతడి కఠోర శ్రమ, అసాధారణ శారీరక పరివర్తన ఉంది. ఈ మార్పు వెనుక ఉన్న రహస్యాలను అతడి పర్సనల్ ట్రైనర్ సూర్య యాదవ్ ఓ జాతీయ మీడియాకు వెల్లడించాడు.

గత మూడేళ్లలో భువనేశ్వర్ తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అతడి బరువులో పెద్దగా మార్పు రాలేదు. అప్పుడు, ఇప్పుడు కూడా భువీ బరువు సుమారు 73-74 కిలోలే. కానీ, అసలు మార్పంతా శరీరంలోని కొవ్వు, కండరాల నిష్పత్తిలోనే ఉంది. మూడేళ్ల క్రితం భువీ శరీరంలో కొవ్వు శాతం (బాడీ ఫ్యాట్) దాదాపు 20 శాతం ఉండగా, కఠోర శ్రమతో దాన్ని 13-14 శాతానికి తగ్గించుకున్నాడు. అంటే, కొవ్వును కరిగించి, ఆ స్థానంలో కండరాల బలాన్ని పెంచుకున్నాడు. ఇది ఫాస్ట్ బౌలర్‌కు అత్యంత కీలకం.

గతంలో వెన్ను, చీలమండ, మోకాలి గాయాలతో ఇబ్బందిపడిన భువనేశ్వర్‌కు బరువులు ఎత్తే శిక్షణ అంటే కాస్త భయం ఉండేది. అయితే, ట్రైనర్ సూర్య యాదవ్ అతడిని నెమ్మదిగా ప్రోగ్రెసివ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్‌కు అలవాటు చేశాడు. ఫలితంగా, ఒకప్పుడు స్క్వాట్స్‌లో కేవలం 40 కిలోల బరువును కష్టంగా ఎత్తిన భువీ, ఇప్పుడు ఏకంగా 110-120 కిలోల బరువును సునాయాసంగా ఎత్తే స్థాయికి చేరుకున్నాడు. ఇది అతడి కాళ్లలో పెరిగిన బలానికి నిదర్శనం.

భువనేశ్వర్ శిక్షణ కేవలం జిమ్‌కే పరిమితం కాలేదు. వారంలో 5-6 రోజులు, రోజుకు 5 నుంచి 7 గంటల పాటు కఠినమైన ప్రణాళికను అనుసరించాడు. ఇందులో హెవీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఒలింపిక్ లిఫ్ట్స్, పేలుడు శక్తిని పెంచే ప్లయోమెట్రిక్స్, జంపింగ్ డ్రిల్స్, బౌలింగ్ ప్రాక్టీస్, గాయాల నివారణకు సంబంధించిన వ్యాయామాలు ఉండేవి. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం.. ఫాస్ట్ బౌలింగ్ సమయంలో శరీరంపై పడే తీవ్రమైన ఒత్తిడిని తట్టుకునేలా శరీరాన్ని బలోపేతం చేయడమే. ముఖ్యంగా వెన్నుపై భారం తగ్గించి, తన సహజమైన స్వింగ్, బ్యాక్‌స్పిన్‌ను కాపాడుకునేలా బౌలింగ్ మెకానిక్స్‌ను మెరుగుపరిచాడు.

ఈ అంకితభావం, కఠోర శ్రమ ఫలితమే ఐపీఎల్ 2026లో కనిపించింది. నిలకడైన వేగంతో, అద్భుతమైన స్వింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి, తన కెరీర్‌కు కొత్త ఊపిరి పోసుకున్నాడు. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్లోనూ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. భువనేశ్వర్ పరివర్తన ఎందరో యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
Advertisement
Bhuvneshwar Kumar
Team India comeback
IPL 2026 performance
Fitness transformation
Surya Yadav trainer
New Zealand tour

More Telugu News