ఒక్క రూపాయి చెల్లించకుండానే రైలు ప్రయాణం.. ఎక్కడో తెలుసా?
Add ap7am to your home Screen

ఒక్క రూపాయి చెల్లించకుండానే రైలు ప్రయాణం.. ఎక్కడో తెలుసా?

Bhakra Nangal Train travel without paying a single rupee do you know where
  • భాక్రా-నంగల్‌ మధ్య 13 కి.మీ. రైలు ప్రయాణం
  • టికెట్‌ లేకుండానే ప్రయాణించే అవకాశం
  • ప్రయాణ సమయం సుమారు 40 నిమిషాలు
  • మార్గంలో మూడు సొరంగాలు, ఆరు స్టేషన్లు
  • ప్రస్తుతం మూడు చెక్క బోగీలు
భారత్‌లో రైలులో ప్రయాణించాలంటే సాధారణంగా టికెట్ తప్పనిసరి. కానీ దేశంలో ఓ రైలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. టికెట్ కూడా తీసుకోవాల్సిన పనిలేదు. పంజాబ్‌లోని నంగల్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని భాక్రా వరకు ఈ రైలు నడుస్తోంది.

భాక్రా-నంగల్‌ మధ్య దూరం సుమారు 13 కిలోమీటర్లు. ప్రయాణానికి దాదాపు 40 నిమిషాలు పడుతుంది. శివాలిక్‌ కొండల మధ్యగా, సట్లెజ్‌ నది పక్కన సాగే ఈ ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది. ఈ మార్గంలో మూడు సొరంగాలు, ఆరు చిన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రైలు నడుస్తుంది.

ఈ ప్రత్యేక రైలు చరిత్ర 1948 ప్రాంతంలో మొదలైంది. భాక్రా-నంగల్‌ డ్యామ్‌ నిర్మాణ సమయంలో కార్మికులు, ఇంజినీర్లు, భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రిని ప్రాజెక్టు ప్రాంతానికి తరలించేందుకు దీన్ని ప్రారంభించారు. డ్యామ్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా రైలు సేవలను కొనసాగించారు. క్రమంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇది ముఖ్యమైన రవాణా మార్గంగా మారింది.

ఈ రైలుకు మరో ప్రత్యేకత ఉంది. దీన్ని భారతీయ రైల్వే నిర్వహించడం లేదు. భాక్రా బియాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (బీబీఎంబీ) ఆధ్వర్యంలో ఈ సేవ కొనసాగుతోంది. ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. డీజిల్‌ సహా రైలు నిర్వహణ ఖర్చులను బీబీఎంబీనే భరిస్తోంది.

ఈ రైలు బోగీలకు కూడా ప్రత్యేక చరిత్ర ఉంది. ప్రస్తుతం ఉన్న పాతకాలం నాటి చెక్క బోగీల్లో కొన్ని 1923లో కరాచీలో తయారైనవిగా చెబుతారు. అప్పట్లో కరాచీ అవిభాజ్య భారతదేశంలో భాగంగా ఉండేది. మొదట ఈ రైలును బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజిన్‌తో నడిపేవారు. తర్వాత డీజిల్‌ ఇంజిన్‌ను ఉపయోగించడం ప్రారంభించారు.

ప్రస్తుతం మూడు పాతకాలం నాటి చెక్క బోగీలు ఈ రైలులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. టికెట్‌ లేకుండా ప్రయాణించే అవకాశం ఉండటంతో పాటు పాత రైలు రూపం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

అయితే ఈ ఉచిత రైలు సేవను కొనసాగించడం సవాల్‌గా మారుతోంది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో 2011లో టికెట్లు ప్రవేశపెట్టి ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని బీబీఎంబీ ఆలోచించింది. చివరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వాణిజ్య ఆదాయం కోసం కాకుండా భాక్రా-నంగల్‌ డ్యామ్‌ నిర్మాణంతో ముడిపడిన చారిత్రక గుర్తుగా ఈ రైలును కొనసాగించాలని నిర్ణయించారు.

ఇప్పటికీ స్థానిక గ్రామాల ప్రజలు, విద్యార్థులు, పర్యాటకులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. దేశంలో టికెట్‌ లేకుండా ప్రయాణించే అరుదైన రైలు సేవగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
Advertisement
Bhakra Nangal Train
Free train travel India
Bhakra Beas Management Board
Nangal to Bhakra route
Indian Railways heritage
Free train journey Punjab

More Telugu News