‘గజ్వేల్ గడీ’ తర్వాత ఇప్పుడు ‘సిరిసిల్ల గడీ’ని కూలుస్తాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

‘గజ్వేల్ గడీ’ తర్వాత ఇప్పుడు ‘సిరిసిల్ల గడీ’ని కూలుస్తాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy says Sircilla Gadi will be demolished after Gajwel Gadi
  • కేటీఆర్‌పై సీఎం రేవంత్‌ తీవ్ర విమర్శలు
  • సిరిసిల్లకు రూ.1,500 కోట్ల కేటాయింపు
  • కాంగ్రెస్ నేతకు మంత్రి పదవి హామీ
  • బతుకమ్మ చీరలపై కమీషన్ల ఆరోపణలు
  • దళితుల అంశంలో బీఆర్ఎస్‌పై విమర్శలు
సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో గజ్వేల్ గడీని కూల్చుతామని చెప్పి చేసి చూపించామని, ఇప్పుడు సిరిసిల్ల గడీని కూడా నేలమట్టం చేద్దామని సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చారు.

కేటీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ.. ‘పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ’ అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తన విలువ ఏంటో ఫామ్‌హౌస్‌లో పడుకున్న వారి అయ్యను అడిగితే తెలుస్తుందని అన్నారు.

గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే నాయకుడిని భవిష్యత్తులో మంత్రిని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూ.. తాను సీఎం అయిన తర్వాత సీతక్క వంటి సామాన్యులకు మంత్రి పదవులు దక్కాయని పేర్కొన్నారు.

బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లే
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీఎం విమర్శించారు. టీవీలు, పేపర్లు, స్టార్ హోటళ్లు, ఫామ్‌హౌస్‌లు మాత్రమే సంపాదించుకున్నారని ఆరోపించారు. కరీంనగర్ కలెక్టరేట్‌ను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. టెండర్లు దక్కించుకుని కమీషన్లు తీసుకున్నారని, చివరకు బతుకమ్మ చీరల తయారీలోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘పుట్టింటి సారె’ పేరుతో ఆడబిడ్డలకు నాణ్యమైన చీరలు అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తున్నామని చెప్పారు.

దళితులపై చిన్నచూపా?
అసెంబ్లీలో స్పీకర్‌ను దూషించి అవమానించిన ఘనత బీఆర్ఎస్ నాయకులదేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎర్రవల్లిలో దళితులు డప్పు కొడితే ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో కడిగి అణగదొక్కారని ఆరోపించారు. దళితులంటే బీఆర్ఎస్‌కు అంత చిన్నచూపా అని ప్రశ్నించారు.

ఎర్రవల్లి భూముల ఆక్రమణలతో పాటు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావుల అక్రమాస్తులపై లెక్కలు తేలుస్తున్నామని సీఎం అన్నారు. ‘ఎట్ హోమ్’, ‘దక్కన్ స్టార్ హోటల్స్’ పేరుతో ఉన్న ఆస్తులు వారి పేర్లకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అసెంబ్లీలో సమయం లేక కొన్ని విషయాలు చెప్పలేకపోయామని, త్వరలో ‘పార్ట్-2’లో అన్ని వివరాలు బయటపెడతామని ప్రకటించారు.
Advertisement
Revanth Reddy
KTR
Sircilla Public Meeting
BRS Corruption Allegations
Telangana Political News
Gajwel Sircilla Gadi

More Telugu News