గిదా పద్ధతి రాహుల్?: కేసీఆర్ టోన్‌లో ప్రియదర్శి క్రేజీ రిప్లై
- బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న నాని 'ది ప్యారడైజ్'
- కేసీఆర్ ను గుర్తు చేసే పాత్రను పోషించిన ప్రియదర్శి
- 'బాపూ.. ఇచ్చి పడేశినావు' అని రాహుల్ ట్వీట్
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ది ప్యారడైజ్’ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంటోంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రియదర్శి పోషించిన పూర్తి స్థాయి మాస్ పొలిటికల్ లీడర్ పాత్ర ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ‘ఎమ్మెల్యే శంకరన్న’గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని గుర్తుచేసేలా ఆయన చూపిన హావభావాలు, గెటప్, బాడీ లాంగ్వేజ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో ప్రియదర్శి అద్భుత నటనపై తోటి నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రియదర్శిని ఉద్దేశించి 'బాపూ.. ఇచ్చి పడేసినావు' అని రాహుల్ ట్వీట్ చేయగా... దానికి ప్రియదర్శి కేసీఆర్ శైలిలోనే అత్యంత సరదాగా బదులిచ్చారు. కేసీఆర్ గతంలో ఓ సమావేశంలో అన్న ఫేమస్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ "ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్లని కోసి దావత్ ఇయ్యాలే" అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య సాగిన ఈ ఫన్నీ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.