మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి సొంత పార్టీలోనే బిగ్ షాక్: ప్రీతిరెడ్డి ఫ్లెక్సీల చించివేత
- మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు
- కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ పార్టీ శ్రేణుల ఆగ్రహం
- పార్టీ అధిష్ఠానాన్ని బేఖాతరు చేస్తున్నారంటూ మండిపాటు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానిక బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన గులాబీ శ్రేణులు, పలు ప్రాంతాల్లో వాటిని చించివేసి నిరసన తెలిపారు.
ఐడీపీఎల్, సుచిత్ర ప్రధాన రహదారుల వెంట ప్రీతిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చిత్రాలను విస్మరించడం వివాదానికి కేంద్రబిందువైంది. పార్టీ అగ్రనాయకులను పక్కనబెట్టి కేవలం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రాలను మాత్రమే ఫ్లెక్సీలలో ముద్రించడాన్ని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టాయి.
మల్లారెడ్డి కేవలం స్వప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్నారని, అధిష్ఠానాన్ని బేఖాతరు చేస్తున్నారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఫ్లెక్సీలను చించివేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మల్లారెడ్డి కుటుంబాన్ని హెచ్చరించారు. ఈ పరిణామంపై ప్రీతిరెడ్డి అభిమానులు, మద్దతుదారులు మండిపడ్డారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీలకు, పార్టీ రాజకీయాలకు ముడిపెట్టి గొడవ చేయడం సరైంది కాదని వారు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా మేడ్చల్, మల్కాజిగిరి పరిధిలో మల్లారెడ్డి వర్గానికి, స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు ఈ ఫ్లెక్సీల గొడవతో మరోసారి బహిర్గతమయ్యాయి.