దిశ సాలియాన్ మరణం కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాకరే, అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ. 500 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశ అనుమానాస్పద మృతి కేసు
- నష్టపరిహారం కోరుతూ నోటీసులు పంపిన దిశ తండ్రి
- బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ సాలియాన్ అనుమానాస్పద మృతి కేసులో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే, ఎన్సీపీ (ఎస్పీ) నేత, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు తీవ్ర చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దిశ సాలియాన్ తండ్రి సతీశ్ సాలియాన్ వారిద్దరికీ రూ. 500 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు జారీ చేశారు.
తన కుమార్తె మృతిపై న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపితమైనదిగా, కుట్రపూరితమైనదిగా చిత్రీకరించేందుకు ఆదిత్య థాకరే, అనిల్ దేశ్‌ముఖ్ యత్నించారని సతీశ్ సాలియాన్ ఆరోపించారు. తమ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్యాలు వ్యాప్తి చేసినందుకు అన్ని ప్రధాన మీడియా, డిజిటల్ వేదికల ద్వారా బహిరంగంగా, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
ఈ కేసులో సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆదిత్య థాకరే వ్యాఖ్యానించడాన్ని కూడా సతీశ్ సాలియాన్ తప్పుబట్టారు. ఈ పరిణామంపై స్పందించిన ఆదిత్య థాకరే, తనకు దిశ సాలియాన్‌తో ఎలాంటి పరిచయం లేదని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు వ్యక్తులు గత ఆరేళ్లుగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.