'రణబాలి' నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టిన మూవీ టీమ్

'రణబాలి' నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టిన మూవీ టీమ్

Ranabali Big Update Movie Team Wraps Up Shooting
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల 'రణబాలి' షూటింగ్ పూర్తి
  • 130 రోజుల పాటు సాగిన చిత్రీకరణకు ముగింపు పలికిన చిత్రబృందం
  • అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
  • చరిత్రలో మరుగునపడిన వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా 
  • త‌న‌ తల్లి పేరునే రష్మిక పాత్రకు పెట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' చిత్రీకరణ పూర్తయింది. గత 130 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న షూటింగ్‌కు చిత్రబృందం గుమ్మడికాయ కొట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తన 'ఎక్స్‌' ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. తన చిత్ర బృందాన్ని 'అలుపెరుగని సైన్యం'గా అభివర్ణిస్తూ, ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.

భారీ అంచనాల నడుమ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 

విడుదలకు చాలా ముందే సినిమా సిద్ధమవుతుందని, ఇప్పటికే మొదటి భాగం నేపథ్య సంగీతం (బీజీఎం) కూడా పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో రష్మిక పోషిస్తున్న 'జయమ్మ' పాత్రకు తన తల్లి పేరు పెట్టుకున్నట్లు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఇటీవల వెల్లడించారు. "రణబాలి గుండెల్లో ప్రేమగా, ఆత్మలో స్ఫూర్తిగా, వెన్నెముకలో ధైర్యంగా, అతని పిచ్చిలో మాధుర్యంగా జయమ్మ పాత్ర ఉంటుంది" అని ఆయన అభివర్ణించారు. రష్మిక తన నటనతో జయమ్మ పాత్రకు ప్రాణం పోయడమే కాకుండా ఆ పాత్రను శాశ్వతంగా నిలిచిపోయేలా చేసిందని ప్రశంసించారు.

19వ శతాబ్దం నేపథ్యంలో 1854-1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా 'రణబాలి'ని తీర్చిదిద్దారు. బ్రిటిష్ పాలకులు చరిత్ర పుస్తకాలలో తప్పుగా చూపించిన లేదా పూర్తిగా తుడిచిపెట్టిన ఎన్నో నిజాలను ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇది ఏ ఒక్కరి బయోపిక్ కాదని, చారిత్రక ఆధారాలు, మౌఖిక కథనాలు, అణచివేతకు గురైన రికార్డుల ఆధారంగా ఆ కాలాన్ని పునర్నిర్మించే ప్రయత్నమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో విజయ్ 'రణబాలి'గా నటిస్తుండగా, 'ది మమ్మీ' ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ 'సర్ థియోడర్ హెక్టర్' అనే కీలక ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
Advertisement
Vijay Deverakonda
Rashmika Mandanna
Ranabali Movie
Rahul Sankrityan
Mythri Movie Makers
Ranabali Release Date

More Telugu News