స్థానిక సంస్థల ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంలాంటివి: జగన్
- అధికార దుర్వినియోగం, అక్రమ కేసులను ఎదుర్కొని వైసీపీ శ్రేణులు నిలబడాలని పిలుపు
- సర్ ప్రక్రియలో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని వెల్లడి
- స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక 'కురుక్షేత్ర సంగ్రామం' లాంటివని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులను ఎదుర్కొని వైసీపీ కార్యకర్తలు గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వెనుక స్థానిక ఎన్నికలను తప్పించుకునే కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయన్నారు.
సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయంటే, ఎన్నికలు ఏ రీతిలో సజావుగా జరుగుతాయో అర్థం చేసుకోవచ్చని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం పారదర్శక ఎన్నికలు సాధ్యం కావని... నిత్యం ఏదో ఒక డ్రామా ఆడుతూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు అదే 23 సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. దౌర్జన్యాలు, అబద్ధాలు ఎల్లకాలం సాగవని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.